కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 రోజుల అనంతరం నేడు కేబినెట్‌ను విస్తరించనున్నారు బీఎస్ యడియూరప్ప. ఈ మంత్రివర్గ విస్తరణలో 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
జులై 26న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్డీ... అదే నెల 29న శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 20 రోజులకు పైగా ఏకసభ్య కేబినెట్‌ను నిర్వహించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో శనివారం చర్చించిన అనంతరం 20వ తేదిన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు యడ్డీ.
రాజ్‌భవన్ వేదికగా ఉదయం 10.30 నిమిషాలకు గవర్నర్ వాజుభాయ్ వాలా నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
"ఉదయం 10.30-11.30 గంటల మధ్య కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఈ విషయమై గవర్నర్‌కు లేఖ రాశాను. అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధాన కార్యదర్శికి సూచించాను."
-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
వెంటనే పనిలోకి...
మంత్రులుగా ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ ఉంటుందని స్పష్టం చేశారు యడ్డీ.
మంత్రులుగా ఎవరు?
మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్న దానిపై ఆశావహులైన ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గంలో ఉండే నేతలపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అనుభవం ఉన్న నేతలు, యువకులతో మిళితమైన మంత్రివర్గ ఏర్పాటుకు భాజపా కేంద్ర నాయకత్వం యోచిస్తోందని తెలుస్తోంది.
యడియూరప్పను పలు సందర్భాల్లో వ్యతిరేకిస్తూ వస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నేత బీఎల్ సంతోష్ కీలక సమయంలో కేంద్ర నాయకత్వాన్ని కలవడం యడ్డీ వర్గీయుల్లో ఆందోళనకు కారణమైంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం... తొమ్మిది వర్గాలను మంత్రివర్గంలో పరిగణనలోకి తీసుకోవాల్సి రావడం, ప్రాంతాల వారిగా పదవుల కేటాయింపు నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ యడ్డీకి కత్తిమీద సాములా మారింది. అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదే కావడం వల్ల పదవులు రాని నేతలు బహిరంగంగా అసమ్మతిని తెలియజేయకపోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెబల్ ఎమ్మెల్యేల భవితవ్యం?
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నుంచి భాజపాలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున వారికి పదవులు కేటాయించకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మాజీ స్పీకర్ కే ఆర్ రమేశ్ కుమార్ 17మంది సంకీర్ణకూటమి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీం నిర్ణయం అనుకూలంగా ఉంటే వారిని తిరిగి గెలిపించి... మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు భాజపా యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!