చైనాలో మొదలైన కరోనా ఇప్పుడు భారత్‌లో ప్రభావం చూపిస్తోంది. దేశంలో నమోదైన కేసులు.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాజస్థాన్ జైపూర్‌లో నలుగురు విదేశీయులు సహా 11 మందిని వైద్య నిర్బంధంలో ఉంచారు అధికారులు. రాజస్థాన్ వైద్య విశ్వవిద్యాలయంలో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీయుల్లో ఇద్దరు ఇటలీకి చెందినవారు కాగా.. ఇద్దరు హాంకాంగ్, జపాన్ దేశాలవారు. మిగిలిన ఏడుగురు భారతీయులు.
విదేశీయులు వైరస్ వ్యాప్తి చెందిన జపాన్, ఆగ్నేయాసియా దేశాలను సందర్శించినట్లు తెలుస్తోంది. అయితే భారత్‌కు చెందిన వారి ప్రయాణ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వారికి వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని.. అయితే వైరస్ వ్యాప్తి ఉన్న దేశాలను సందర్శించినందున వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఓ ఇటాలియన్ జంటకు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.
హిమాచల్‌కు పాకిన వైరస్
హిమాచల్‌ప్రదేశ్‌లో వైరస్ లక్షణాలున్నట్లు అనుమానాలున్న ఓ వ్యక్తికి ఇందిరా గాంధీ అసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఏళ్ల ఈ వ్యక్తి కొద్దిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాను సందర్శించి వచ్చాడు.