బిహార్ ఎన్నికల్లో భాగంగా.. ఈ నెల 28న 71 స్థానాలకు తొలి దఫా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం నామినేషన్ ప్రక్రియ ఇటీవలే ముగిసింది. తాజాగా.. 1,090 అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లుబాటు అవుతాయని అధికారులు వెల్లడించారు.
అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం గడువు ఉంది. అందువల్ల ఆ తర్వాతే అభ్యర్థుల సంఖ్యను ఖరారు చేయగలుగుతామని అదనపు ముఖ్య ఎన్నికల అధికరి సంజయ్ కుమర్ సింగ్ తెలిపారు.
మొత్తం 1,354మంది నామపత్రాలు దాఖలు చేయగా.. వీటిలో 264 చెల్లవని సంజయ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- బిహార్ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో.. తొలిసారిగా ఆన్లైన్లో నామపత్రాలను సమర్పించేందుకు అనుమతినిచ్చింది ఈసీ. అయితే కేవలం 10మంది ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారు.
రెండో దఫా పోలింగ్‌లో భాగంగా.. ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామపత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకునేందుకు చివరి గడువు అక్టోబర్ 19. నవంబర్ 3న 94 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
మిగిలిన స్థానాలకు నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. 10న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
భారీగా ఆయుధాలు స్వాధీనం...
ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,022 అక్రమ ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15,335 లైసెన్సులున్న ఆయుధాలను డిపాజిట్ చేశారు. మరో 1,862 ఆయుధాల లైసెన్సును వివిధ కారణాలతో రద్దు చేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,90,792 లీటర్ల మద్యాన్ని జప్తు చేశారు. బిహార్‌లో మద్యంపై నిషేధం ఉండటం గమనార్హం. వివిధ చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీల రూపంలో రూ. 14.63 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:- కరోనా కారణంగా బిహార్ ఎన్నికల రూల్స్‌లో మార్పు