విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశా సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
సర్వాంగ సుందరంగా అలంకరించిన మూడు భారీ రథాల్లో శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు ఊరేగనున్నారు. వారం రోజుల ఆతిథ్యం అనంతరం.. దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని బయటే ఉండిపోతాయి.
మరుసటి ఏకాదశి రోజున దేవతామూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోని రత్న సింహాసనంపైకి చేర్చితే యాత్ర సమాప్తమవుతుంది.
పటిష్ఠ భద్రత...
సుమారు 10 లక్షల మంది భక్తులు ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ జగన్నాథ రథయాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం.
సుమారు 10 వేల మంది పోలీసులను రథయాత్ర కోసం మోహరించారు. తీర ప్రాంత భద్రతా దళాన్ని అప్రమత్తం చేశారు. పూరీకి వచ్చే వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.