లాక్డౌన్ వల్ల పనుల్లేక, సొంత రాష్ట్రాలకు వెళ్లే మార్గం లేక చిక్కుకుపోయిన వలస కూలీలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది సాహసాలు చేస్తూ ఇళ్లకు చేరుకుంటుండగా అనేకమంది ఇంకా పనిస్థలాల్లోనే ఉండిపోయారు. ప్రభుత్వం వలస కార్మికుల తరలింపునకు తాజాగా మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ.. ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమను స్వరాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర చంద్రపూర్‌లో వలసకార్మికులు రోడ్డెక్కారు. 'మమ్మల్ని పంపించేందుకు ఏర్పాట్లు చేయండి సార్' అంటూ ఆవేదన చెందారు.
"వెయ్యి మందికి పైగా వలస కార్మికులు తమను సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేశారు. వీరిలో ఎక్కువగా ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణంలో పనిచేస్తున్నవారు ఉన్నారు. రహదారులను దిగ్బంధించి.. రైల్వేస్టేషన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బంగాల్‌కు చెందిన వారు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా తమ ఆదాయమార్గాలను కోల్పోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు వారు తెలిపారు."
-పోలీసుల ప్రకటన
ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి తిరిగి సొంత రాష్ట్రాలకు పంపించాలంటే నిబంధనలను పాటించాలని, రైళ్ల కోసం దరఖాస్తును పూర్తి చేయాలని సూచించినట్లు వెల్లడించారు పోలీసులు. ఆందోళనకారులకు భోజనం పెట్టించి.. వారి తాత్కాలిక ఆవాసాలకు పంపించినట్లు తెలిపారు.