Bharat Jain Richest Beggar : బిచ్చమెత్తుకుంటూ రూ.7కోట్లకు పైగా సంపాదించాడు ఓ వ్యక్తి. నెలకు రూ.60వేల నుంచి 75వేల వరకు ఆర్జిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడిగా నిలిచాడు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పలు చోట్ల ఆస్తులను సైతం కలిగి ఉన్నాడు. పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూ.. ఓ డూప్లెక్స్ ఇంటిలో నివాసం ఉంటున్నాడు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇంత సంపాదించినా ఇంకా అదే వృత్తిలో కొనసాగుతున్నాడు ఆ యాచకుడు.
అడుక్కుంటూ ఇలా రికార్డ్ స్థాయిలో ఆదాయం ఆర్జిస్థున్న వ్యక్తి పేరు భరత్ జైన్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతడి ఆస్తి విలువ రూ.7.5 కోట్లు! ఓ జాతీయ మీడియా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. చిన్నప్పటి నుంచే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భరత్ జైన్.. తన చదువును సజావుగా సాగించలేకపోయాడు. అనంతరం యాచక వృతిలోకి ప్రవేశించాడు. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం భరత్ జైన్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, తండ్రి, ఓ సోదరుడు ఉన్నాడు. తాను యాచక వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ పిల్లలను మాత్రం చాలా బాగా చదివిస్తున్నాడు భరత్ జైన్.
జైన్‌కు ముంబయిలో ఓ టూ-బెడ్ రూం ఫ్లాట్ ఉంది. దీని విలువు దాదాపు రూ.1.2కోట్లు ఉంటుంది. ఇతడు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఠాణేలో రెండు షాప్‌లు సైతం ఇతడికి ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.30వేల ఆదాయం అద్దె రూపంలో అందుతోంది. దాంతో పాటు అడుక్కుంటూ రోజుకు రూ.2000-2500 ఆర్జిస్తున్నాడు. భరత్ జైన్ తరచుగా ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఇతర ప్రముఖ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం భరత్ జైన్ కుటుంబం ముంబయిలోని ప్యారెల్ ప్రాంతంలో.. ఓ సింగిల్ బెడ్ రూం డ్యూప్లెక్స్ ఇంటిలో నివాసం ఉంటోంది. అతడి పిల్లలు స్థానిక కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్‌ను నడిపిస్తున్నారు. అయితే యాచక వృత్తి మానేయమని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినట్లేదు భరత్ జైన్. తనను ఇంతవాడ్ని చేసిన ఈ వృత్తిని వదిలేందుకు నిరాకరిస్తున్నాడు.