18 ఏళ్లలోపు వారిపై 'కొవాగ్జిన్(Covaxin)' టీకా ట్రయల్స్‌ను ప్రారంభించింది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్. ఇందుకు సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) గురువారమే అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ చేపడుతుండగా.. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి.
నాగ్‌పుర్‌లోని మెడిట్రినా ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ వసంత్ ఖాలాత్కర్ పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ మొదలయ్యాయి. ఇప్పటికే 12-18 ఏళ్ల పిల్లల రక్త నమూనాలను సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 మంది వలంటీర్లను పరిశీలించినట్లు పేర్కొన్నాయి. రక్త నమూనాల నివేదికలు అందిన తర్వాత వారికి టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. వ్యాక్సినేషన్‌కు ముందు, ఆ తర్వాత పిల్లలకు జిల్లా యంత్రాంగం సైతం పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మూడు దశల్లో..
ఈ వ్యాక్సినేషన్ ట్రయల్స్ మూడు దశల్లో జరగనున్నాయి. ముందుగా 12-18 ఏళ్ల వారికి టీకా ఇస్తారు. ఆ తర్వాత 6-12 ఏళ్ల పిల్లలకు, తర్వాత 2-6 ఏళ్ల వయసు పిల్లలకు టీకా వేస్తారు. మంచి ఫలితాలు కనిపించిన పిల్లలకు 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: బికినీ రంగుపై రాజకీయ రగడ!