సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్' ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అన్నదాతలు బంద్ చేపట్టగా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. బంద్ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రోడ్లు, రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి.. ప్రభుత్వానికి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.
- దిల్లీ(delhi bharat bandh news), పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బంద్ తీవ్రత ఎక్కువగా కనిపించింది. కేరళ, బిహార్, ఝార్ఖండ్, బంగాల్, ఒడిశాల్లోని కొన్ని ప్రాంతాలపై బంద్ ప్రభావం పడింది.
- బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో పటిష్ఠ భద్రత చేపట్టారు పోలీసులు. దిల్లీ లోపల ఎక్కడిక్కడ బారికేడ్లు వేసి వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. అటు దిల్లీ సరిహద్దుల్లోని రోడ్లపై నిరసనకారులు బైఠాయించారు. దీంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా దిల్లీ-ఎన్సీఆర్, గుర్‌గ్రామ్, ఘజియాబాద్, నోయిడాలో ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు అల్లాడిపోయారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
- బంద్ కారణంగా పంజాబ్‌లో(punjab bharat bandh news) లాక్డౌన్ తరహా దృశ్యాలు కనిపించాయి. మోగా ప్రాంతంలోని జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. అమృత్‌సర్‌లో రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసనలు తెలిపారు.
- హరియాణాలోనూ ఇంచుమించు ఇవే దృశ్యాలు కనిపించాయి. సిర్సా, ఫతేబాద్, కురుక్షేత్రలోని రహదారులను మూసివేశారు రైతులు.
- బంగాల్లో బంద్ ప్రభావం అస్సలు కనిపించలేదు. ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిరసనలు జరిగాయి.
- ఝార్ఖండ్, బిహార్, ఒడిశాలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిహార్‌లో నిరసనలకు మద్దతుగా నిలిచిన ఆర్జేడీ, సీపీఐ కార్యకర్తలు.. పట్నా, జహానాబాద్ తదితర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టి అనేక రోడ్లపై బైఠాయించారు. ఒడిశాలోని భువనేశ్వర్, బాలేశ్వర్, సంబల్పుర్లో నిరసనలు జరిగాయి.
- కేరళలో(kerala bharat bandh 2021) మాత్రం బంద్ సంపూర్ణంగా సాగింది. అధికార వామపక్ష కూటమి.. నిరసనలకు మద్దతివ్వడమే ఇందుకు కారణం. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు తెరుచుకోలేదు. ప్రజల కార్యకలాపాలు లేక రోడ్లు వెలవెలబోయాయి.
- కర్ణాటకలో అక్కడక్కడా రాస్తారోకోలు జరిగాయి.
- బంద్ కారణంగా మొత్తం మీద 25 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని రైల్వే విభాగం వెల్లడించింది.
'బంద్ విజయవంతం...'
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు అనూహ్య స్పందన లభించిందని సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించింది.
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్.. తాజా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు.
"ఏడాదిగా నిరసనలు చేస్తున్నాము. కానీ దేశ యువతలో ఉద్యమం మొదలైంది. రైతుల సమస్యను పట్టించుకోని వారందరూ ఇప్పుడు మా మాటలు వింటున్నారు. నిరసనలతో ప్రజలు ఒక్క రోజు ఇబ్బంది పడితే తప్పేమీ లేదు. మేము 10 నెలలుగా ఎండ, వానలో ఆందోళనలు చేస్తున్నాము. ఈ ఒక్క రోజు మాకు సంఘీభావంగా వారు ఇబ్బంది పడితే ఏం కాదు. నిరసనలకు ముగింపు ఏంటి అనేది నాకు తెలియదు. దీనికి పరిష్కారం కోర్టుల్లో లేదు. వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో జరిగే చర్చలతోనే సమస్యను పరిష్కరించగలము."
-- రాకేశ్ టికాయత్, బీకేయూ నేత.
పార్టీల మద్దతు..
దాదాపు ఎన్డీఏయేతర పార్టీలన్నీ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. కొన్ని పార్టీల కార్యకర్తలు నిరసనల్లో కూడా పాల్గొన్నారు. టీఎంసీ మద్దతిచ్చినా.. బంద్‌కు దూరంగా ఉండిపోయింది.
భారత్ బంద్ నేపథ్యంలో దేశంలోని పలువురు అగ్రనేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రైతులతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.
"అహింసా మార్గంలో రైతులు చేపట్టిన సత్యాగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కానీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదు. అందుకే రైతన్నలు నిరసనలు చేస్తున్నారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
"ఈరోజు భగత్ సింగ్ జయింతి. జాతికి స్వేచ్ఛ దక్కాలనే సంకల్పంతో ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడలేదు. ఏడాదిగా రోడ్లపై బైఠాయించి రైతులు నిరసనలు తెలిపే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండరు. దీని కోసం భగత్ సింగ్ పోరాడలేదు. రైతుల డిమాండ్లు న్యాయపరమైనవి. వాటిని ప్రభుత్వం వినాలి. వారి డిమాండ్లు వింటే వారి ముందు తలవంచినట్టు కాదు."
-- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం.
రాష్ట్రపతి సంతకంతో..
2020 వర్షాకాల సమావేశాల్లో మూడు సాగు చట్టాలను అమోదించింది పార్లమెంట్. అనంతరం 2020 సెప్టెంబర్ 27న రాష్ట్రపతి సంతకంతో చట్టం కార్యరూపం దాల్చింది. ఏడాది గడిచిన నేపథ్యంలో సోమవారం బంద్ చేపట్టారు రైతులు.
ఇదీ చూడండి:- 'కేంద్రం తీరు వల్లే రైతులు బంద్ చేపట్టారు'