సాయం చేస్తామని నమ్మించి 25 ఏళ్ల యువతిని వ్యభిచార వృత్తిలోకి దింపారు ముగ్గురు వ్యక్తులు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు. అనంతరం బాధితురాలిపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం కర్ణాటక బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రాజాజీనగర్‌కు చెందిన ఎన్జీఓ నిర్వాహకురాలు లక్ష్మీ అలియాస్ సంగీత ప్రియ అలియాస్ మంజుల(36), కోలార్‌కు చెందిన బ్రహ్మేంద్ర రావణ్(26), శేషాద్రిపురంలోని ఓ లాడ్జి ఓనర్ సంతోశ్ కుమార్(45)ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్య జిల్లాకు చెందిన బాధితురాలు కొన్ని నెలల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ బెంగళూరుకు వచ్చింది. ఈ సమయంలో.. లక్ష్మీ బాధితురాలితో పరిచయం పెంచుకుంది. తాను న్యూస్ రిపోర్టర్నని యువతికి చెప్పింది. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. బాధితురాలు తన సమస్యలను లక్ష్మీ వద్ద ప్రస్తావించగా.. అన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికి ఆమెను రాజాజీనగర్‌లోని నవభారత్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించింది.
ఆగస్టు 14న లక్ష్మి.. బాధితురాల్ని శివానంద సర్కిల్‌లోకి ఓ లాడ్జికి తీసుకెళ్లింది. యువతి దగ్గర ఉన్న డబ్బుల్ని బలవంతంగా తీసుకుంది. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి వ్యభిచార వృత్తిలోకి దింపింది. ఆ తర్వాత మరో నిందితుడు బ్రహ్మేంద్ర రావణ్ తాను తీసుకొచ్చిన కస్టమర్లతో గడపాలని బాధితురాల్ని బలవంత పెట్టాడు. అనంతరం బాధితురాలిని ఓ గెస్ట్ హౌస్‌కు, ఆనందరావు సర్కిల్‌లోని లాడ్జికి తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహించారు.
లాడ్జిపై దాడులు నిర్వహించి యువతిని రక్షించాం. నిందితులు లాడ్జికి పంపిన గుర్తు తెలియని వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేశాం. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం.
-- పోలీసులు
హోటల్లో ప్రేయసితో మర్డర్ కేసు నిందితుడు..
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని ప్రేయసితో కలిసి హోటల్లో గడిపేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక హుబ్బళ్లిలో జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సహకరించిన ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్‌ఖాన్ అనే వ్యక్తి హత్యకేసులో బచ్చాఖాన్(55)ని శనివారం విచారణ నిమిత్తం బళ్లారి నుంచి ధార్వాడ్ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితుడు బచ్చాఖాన్ తన ప్రేయసితో కొంత సమయం గడిపేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరాడు. పోలీసులు అందుకు ఓకే చెప్పారు. విషయం తెలుసుకున్న గోకుల్‌రోడ్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి పోలీసు సిబ్బందిని, హత్య కేసు నిందితుడు బచ్చాఖాన్‌ను, అతడి ప్రేయసిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో బచ్చాఖాన్ గత 20 ఏళ్లుగా జైల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి అండగా నిలిచిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, కారుతో ఢీకొట్టి చంపిన ఉన్మాది