Father set son on fire: కర్ణాటక బెంగళూరులో అత్యంత అమానీయ ఘటన వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల్లో రూ.1.5కోట్లు లెక్క చెప్పలేదనే ఆగ్రహంతో కన్న కుమారుడిపై తండ్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వద్దు నాన్నా అని ప్రాధేయపడినప్పటికీ కుమారుడు అనే కనికరం కూడా లేకుండా క్రూర చర్యకు పాల్పడ్డాడు. బెంగళూరు చామరాజపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్ నగర్లో జరిగిన ఈ ఘటన స్థానికులను విస్మయానికి గురి చేసింది.
Bengaluru News: ఆజాద్ నగర్లో నివాసముండే సురేంద్ర, అర్పిత్ తండ్రీకొడుకులు. స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తారు. గతవారం అర్పిత్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి రూ.1.5కోట్లు లెక్క చూపలేదు. దీంతో ఆగ్రహించిన సురేంద్ర.. ఇంట్లోనే కుమారుడిపై పెట్రోల్ పోశాడు. అర్పిత్ భయంతో బయటకు పరగులు తీశాడు. క్షమించమని ప్రాధేయపడ్డాడు. అయినా వినిపించుకోని తండ్రి నడిరోడ్డుపై అర్పిత్కు నిప్పంటించాడు. దీంతో అతడు మంటల్లో కాలుతూ ఆ ప్రాంతమంతా పరుగులు తీశాడు. అక్కడున్న స్థానికులు ఎలాగోలా మంటలను ఆర్పారు. కానీ అప్పటికే అర్పిత్ శరీరం బాగా కాలిపోయింది. హుటాహుటిన అతడిని విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. కానీ చికిత్సకు అర్పిత్ స్పందించలేదని, కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సురేంద్ర తన కుమారుడికి నిప్పంటించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. కేసుపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లి పేరుతో 200 మంది యువతులకు టోకరా- సర్వం దోచేసి..