బంగాల్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకిర్ హుస్సేన్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు చెప్పారు. కోల్‌కతా వెళ్లేందుకు నిమ్టిటా స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనపై బాంబులు వేసినట్లు తెలిపారు. గాయపడిన మంత్రిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జాంగిపుర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి మార్చారు.
పార్టీ వర్గాల సమాచారం మేరకు మంత్రి కాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జాంగిపుర్ ఆసుపత్రి నుంచి ముర్షిదాబాద్ వైద్య కళాశాలకు తరలించినట్లు చెప్పారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు సైతం గాయపడినట్లు తెలిపారు.
బాంబు దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
జాకిర్పై దాడిని పార్టీ జిల్లా అధ్యక్షుడు అబు తాహెర్ ఖండించారు. ఆయన రాష్ట్ర మంత్రి మాత్రమే కాదని, జిల్లాలో మంచి పారిశ్రామికవేత్తగా తెలిపారు. అయితే.. ఈ దాడికి పాల్పడింది ఎవరనే తెలియలేదని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.