బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆలాపన్ బంధోపాధ్యాయ్(1987 బ్యాచ్) సేవలను ఉపపయోగించుకోదలచినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపించింది. తక్షణమే ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం దిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలని ఆయనకు సూచించింది. సోమవారం (మే 31) నాటికి ఆయనకు 60 ఏళ్లు నిండుతాయి.
నిజానికి ఆ రోజునే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన సేవలను మరో మూడు నెలల పాటు పెంచుతూ గత సోమవారమే సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 12న మమత ప్రధానికి లేఖ రాశారు. బంధోపాధ్యాయ్ గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
అదేనా కారణం?..
వాస్తవానికి బంగాల్లో వరదలపై ప్రధాని మోదీ శుక్రవారం జరిపిన సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆయనను వెంటనే దిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించడం వెనుక ఈ కారణం ఏమైనా ఉండొచ్చా? అనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తప్పుపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు.
"ఎన్నికల్లో బంగాల్ ప్రజలు భాజపాను తిరస్కరించారు. అంతేగాక మమతా బెనర్జీని అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్నారు. అందుకే మమతకు కుడిభుజంలా ఉన్న అధికారి పదవీ పొడిగింపును అంగీకరించట్లేదు. ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు."
-శేఖర్ రాయ్, టీఎంసీ ఎంపీ
ఇవీ చదవండి: మోదీ- దీదీ 'భేటీ'పై వివాదం