బంగాల్ శాసనసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రజలు. పలు కేంద్రాల్లో భారీగా క్యూలైన్లలో బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. 44 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. 373 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.


మొత్తం 15,940 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆయా కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రజలు.


భాజపాపై ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు
భాజపాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తృణమూల్ కాంగ్రెస్. సితల్కుచి, నతల్బరీ, తుఫాంగంజ్, దిన్హటా వంటి పోలింగ్ బూత్‌ల వద్ద భాజపా గూండాలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించింది. బూత్‌ల్లోకి టీఎంసీ ఏజెంట్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
టీఎంసీపై భాజపా ఆరోపణలు..
తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించటం లేదని ఆరోపించారు కోల్‌కతాలోని తొల్లిగంజ్ భాజపా అభ్యర్థి బాబుల్ సుప్రియో. గాంధీ కాలనీలోని భారతి బాలికల విద్యాలయంలోని కేంద్రానికి వచ్చి అధికారులతో మాట్లాడారు. ఆన్లైన్లో వివరాలు చూపించాక ప్రస్తుతం ఏజెంటన్లు అనుమతించినట్లు చెప్పారు.

హెల్మెట్‌తో పోలింగ్ కేంద్రానికి టీఎంసీ అభ్యర్థి
కూచ్ బెహర్ జిల్లా నటబారి నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి రవీంద్రనాథ్ ఘోష్ హెల్మెట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దాని నుంచి తప్పించుకునేందుకే తాను హెల్మెట్‌తో పోలింగ్ బూత్‌కు వచ్చినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 200 ఏళ్లుగా చెక్కుచెదరలేదు.. పెచ్చు ఊడలేదు!