Belagavi Contractor Death: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించిన కాంట్రాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెళగావికి చెందిన కాంట్రాక్టర్ సంతోష్ కే పాటిల్ మృతదేహం ప్రైవేట్ లాడ్జిలోని ఓ రూమ్లో పడి ఉంది. పక్క గదిలోనే అతని స్నేహితులు ఉన్నారు. ఈశ్వరప్ప కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పాటిల్ వార్తా సంస్థలకు మెసేజ్లు పంపించాడు. సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఈశ్వరప్ప.. తనకు ఏమీ తెలియదని అన్నారు. తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేశారు. ఆత్మహత్య లేఖలో మృతుడు తన పేరు ఎందుకు రాశాడో తెలియదని అన్నారు. అయితే.. మార్చి 30న తనకు తాను భాజపా కార్యకర్తగా చెప్పుకున్న పాటిల్.. గ్రామీణాభివృద్ధి శాఖ అభివృద్ధి పనుల్లో రూ.4కోట్ల పనులు చేసినట్లు చెప్పారు. ఈ పనులకు రావాల్సిన డబ్బులను అడిగినప్పుడు మంత్రి ఈశ్వరప్ప.. 40 శాతం కమీషన్ అడిగారని పాటిల్ కొద్ది రోజుల క్రితం వాపోయారు.
పాటిల్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మంత్రి ఈశ్వరప్పను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రిపై కేసు నమోదు చేయాలని అన్నారు.
సీఎం బసవరాజ్ బొమ్మై..
సంతోష్ పాటిల్ మృతిపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా స్పందించారు. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతారని అన్నారు. అప్పుడే నిజానిజాలు బయటపడతాయని చెప్పారు. కేసులో తాము కలుగజేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజీనామాలు ఉండవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ''అన్న తిరిగొచ్చాడు..' నిందితుడికి స్వాగతం పలుకుతూ హోర్డింగులా?'