Beating Retreat Ceremony: ఈ ఏడాది రిపబ్లిక్ డే బీటింగ్ రిట్రీట్ వేడుకల నుంచి జాతిపిత మహాత్మాగాంధీకి ఇష్టమైన కీర్తనను తొలగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇది గాంధీ గొప్పతనాన్ని చెరిపివేసే ప్రయత్నమే అని మండిపడింది.
ఇదీ జరిగింది..
గణతంత్ర వేడుకల అనంతరం జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో ప్రతి ఏటా గాంధీకి ఇష్టమైన కీర్తన.. 'అబైడ్ విత్ మీ'ని ప్లే చేస్తారు. కానీ, శనివారం ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన కరపత్రంలో ఈ కీర్తనకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రిపబ్లిక్ డే బీటింగ్ రిట్రీట్ నుంచి మహాత్మా గాంధీకి ఇష్టమైన కీర్తనను తొలగించారు. గాంధీ గొప్పతనాన్ని చెరిపివేసేందుకు భాజపా చేస్తున్న మరో చెత్త ప్రయత్నం ఇది." అని కాంగ్రెస్ పార్టీ సమాచార ప్రతినిధి షమా మొహమద్ పేర్కొన్నారు. గాంధీపై విమర్శలు చేసిన ఎంపీ సాధ్వి ప్రగ్యాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఈ చర్య.. గాడ్సేపై భాజపా అభిమానానికి ప్రతీక అని అన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని 'ఐడియలాజికల్ వార్'గా వర్ణించారు కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్. కాంగ్రెస్ నేత అజయ్ కుమార్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నయా భారతం పేరిట పురాణ సంప్రదాయాలను అగౌరవపరుస్తున్నారని ట్వీట్లు చేశారు.
1950 నుంచి.. ప్రతి ఏటా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ రాసిన 'అబైడ్ విత్ మీ' కీర్తనకు తప్పనిసరిగా ప్రత్యేక స్థానం ఉండేది. కానీ, ఈసారి అలా జరగలేదు. అయితే.. ఈ ఏడాది 'సారే జహాసే అచ్చా' కీర్తనను ప్లే చేయనున్నారు. మొత్తంగా 26 కీర్తనలను ఇండియన్ ఆర్మీ ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: