కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్లోని తన సొంత నియోజకవర్గం బెగూసరాయ్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ప్రజలు వెదురు కర్రతో కొట్టాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు అని పేర్కొన్నారు. వారికి సేవ చేయ చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదని గిరిరాజ్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో మీరు(ప్రజలు) యజమానులు. ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా మెజిస్ట్రేట్‌లకు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. మీ అధికారాలను హరిస్తే గిరిరాజ్ మీతో ఉంటాడు. నిర్లక్ష్యాన్ని మేం భరించము. ఏ అధికారిని కూడా నిర్లక్ష్యంగా పని చేయనీయము. అధికారులు మీ మాట వినకుంటే కర్ర తీసుకుని కొట్టండి.
-గిరిరాజ్ సింగ్, కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి.
ఇదీ చూడండి: 'రామ మందిర నిర్మాణానికి రూ.2,500కోట్ల విరాళాలు'