హరియాణాకు, క్రీడలకు ప్రత్యేక అనుబంధముంది. దేశానికి దిగ్గజ క్రీడాకారులను అందించిన రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించడంపై ఈ రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇక్కడి యువతలో ఎక్కువ శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించినవాళ్లే. హరియాణాలోని కొన్ని గ్రామాలు ఫుట్‌బాల్‌కు, మరికొన్ని బాక్సింగ్‌కు, ఇంకొన్ని గ్రామాలు కబడ్డీ ఆటలకు ప్రసిద్ధి. పానిపత్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహర్.. బాస్కెట్‌బాల్‌ను ప్రేమించే ఓ ఊరు.
"2012లో బాస్కెట్‌బాల్ ఆడడం ప్రారంభించాను. ఇప్పటివరకు 15 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మొత్తంగా 5 పతకాలు సాధించాను. ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేస్తున్నా."
- సావన్, సైనికుడు
ఊరంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లే కనిపిస్తారు. దేశం కోసం ఆడి, స్పోర్ట్స్ విభాగంలో సైన్యంలో చేరినవారూ చాలామందే ఉన్నారు. సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన ఆటగాళ్లనూ ఊర్లో చూడొచ్చు.
"జాతీయస్థాయి పోటీల్లో చాలాసార్లు పాల్గొన్నా. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ద్వారా భారత సైన్యంలో చేరా. 22 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత పదవీ విరమణ పొందా. మా ఊర్లోని ఈతరం బాస్కెట్ బాల్ ఎంతో ఇష్టంగా ఆడుతున్నారు. వాళ్లలో ఎంతోమంది జాతీయస్థాయిలోనూ ఆడారు."
- చంద్‌రామ్, విశ్రాంత సైనికుడు
బాస్కెట్‌బాల్ కోసమే ఈ గ్రామ ప్రజలు ప్రత్యేక సంప్రదాయం పాటిస్తున్నారు. దేశం తరఫున ఆడి, పతకాలు తేవడం ప్రారంభమైన దగ్గర్నుంచీ పుట్టిన ప్రతి బిడ్డా ఆటగాడు కావాలని ఆశీర్వదిస్తూ పీలియా అనే వేడుక నిర్వహిస్తారు. ఆ సమయంలో శిశువులకు బాస్కెట్‌బాల్‌నే కానుకగా ఇస్తారు బంధువులు.
"మా ఊర్లో ఎక్కువగా ఆడే ఆట బాస్కెట్‌బాల్. పీలియా వేడుక సమయంలో శిశువులకు బంధువులు బాస్కెట్‌బాల్‌నే కానుకగా ఇస్తారు."
- రాజు, స్థానికుడు
"మా ఊర్లో బాస్కెట్‌బాల్‌కు మంచి క్రేజ్ ఉంది. ప్రతి ఏడాది ముగ్గురు నలుగురు క్రీడాకారులు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు"
- ఈశ్వర్ సింగ్, స్థానికుడు
ఈ ఊర్లో 6 బాస్కెట్‌బాల్ మైదానాలున్నాయి. ఔత్సాహికులకు శిక్షణనిచ్చేందుకు ముగ్గురు కోచ్‌లను నియమించారు. గ్రామంలో బాస్కెట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడేవారున్నారని కోచ్ దీపక్ శర్మ చెప్తున్నారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఊర్లోని ప్రతిఒక్కరూ బాస్కెట్‌బాల్ ఆడతారు. భారత జట్టులో ఈ ఊరి నుంచి చాలా మంది ఆడారు.
"బాస్కెట్‌బాల్ వల్ల మా ఊరి నుంచి 60 మందికి పైగా క్రీడాకారులకు ప్రభుత్వోద్యాగాలు వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన యువ క్రీడాకారులూ ఎంతోమంది ఉన్నారు. పాఠశాల స్థాయి ఆటలైనా, అసోసియేషన్ పోటీలైనా, ఈ ఊరి నుంచి ప్రతి టోర్నమెంట్‌లో కనీసం ఐదారుగురు ఆటగాళ్లైనా పాల్గొంటారు."
- దీపక్ శర్మ, కోచ్
బాస్కెట్‌బాల్‌పై ఈ ఊరి యువత, చిన్నారులకు ఉన్న ఆసక్తి చూస్తుంటే.. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపైనా హరియాణాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే సత్తా ఉందని అర్థమవుతోంది. కానీ ఆర్థికంగా వారికి కొంత చేయూతనివ్వాల్సిన అవసరముంది. ప్రభుత్వ క్రీడావిభాగం ఈ గ్రామంపై దృష్టిసారిస్తే.. ఇక్కడి ఆటగాళ్లు దేశం మెచ్చే దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారులుగా ఎదుగుతారనడంలో అతిశయోక్తి లేదు.
ఇదీ చూడండి: 'పట్టు'దలతో మహిళల సిరుల పంట