Barnala Policeman Murder : గొడవ జరుగుతుందన్న సమాచారంతో రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ పోలీసు కానిస్టేబుల్‌ను అతి దారుణంగా కొట్టి చంపారు దుండగులు. అయితే ఈ హత్య చేసింది అంతర్జాతీయ కబడ్డీ ఆటగాళ్లే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో ఆదివారం రాత్రి జరిపింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు(పోలీసు) దర్శన్ సింగ్ కొన్నేళ్లుగా బర్నాలా జిల్లాలోని ఠాణా నగరంలో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఆదివారం అర్ధరాత్రి కొందరు కబడ్డీ ఆటగాళ్లు వెళ్లారు. అక్కడే పని చేస్తున్న కొంతమంది కార్మికులతో పాటు యజమానితో బిల్లు విషయంలో వారు గొడవకు దిగారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కానిస్టేబుల్ దర్శన్ సింగ్‌తో పాటు మరో పోలీసును రెస్టారెంట్‌కు పంపించారు. రెస్టారెంట్‌కు చేరుకున్న పోలీసులు ఘర్షణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కబడ్డీ ప్లేయర్స్‌ను పోలీసు వాహనంలో కూర్చొవాల్సిందిగా చెప్పారు.
ఈ క్రమంలో దర్శన్ సింగ్‌తో వాగ్వాదానికి దిగిన ఆటగాళ్లు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి హుటాహుటిన కానిస్టేబుల్‌ను జిల్లాలోని సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ దర్శన్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన అనంతరం రెస్టారెంట్‌ను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పరారయ్యారని ప్రత్యక్ష సాక్షి సరబ్‌జిత్ సింగ్ చెబుతున్నాడు. ఇక వీరంతా ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ అని తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కర్ణాటకలో పరువు హత్య..!
Honor Killing In Karnataka Bangalore : ప్రియుడితో కలిసి పారిపోయినందుకు కన్నకూతుర్నే హత్య చేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శనివారం జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం..
మైసూరులోని హెచ్‌డీకోటేకు చెందిన పల్లవి అనే యువతి ఇంటికి దగ్గర్లోని ఓ కళాశాలలో పీయూసీ చదువుతోంది. ఇదే కాలేజీలో చదువుతున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం పల్లవి తండ్రి గణేశ్‌కు తెలిసి ఇద్దరిని పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవలే వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఎట్టకేలకు బంధువుల సాయంతో యువతిని ఇంటికి రప్పించారు గణేశ్ దంపతులు. చదువు మాన్పించి పరప్పన అగ్రహారంలోని డాక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బంధువుల ఇంట్లో కుమార్తెను ఉంచాడు గణేశ్. అయినా సరే తీరు మార్చుకొని యువతి ప్రియుడిని మళ్లీ సంప్రదించింది. ఈ నెల 14న మళ్లీ అతడితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి గణేశ్ సమీప పోలీస్ స్టేషన్‌లో పల్లవిపై మిస్సింగ్ కేసును పెట్టాడు. వెంటనే ఆపరేషన్ చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే యువతిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 21 శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్లవిపై దాడి చేశాడు తండ్రి గణేశ్. అడ్డొచ్చిన తల్లి శారదమ్మ, బంధువులను దూషించాడు. ఈ ఘర్షణలో యువతికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. వెంటనే నిందితుడు గణేశ్ పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పల్లవిని కొట్టి చంపింది తానేనని పోలీసులు ముందు అంగీకరించాడు. ఈ ఘటనపై పల్లవి అత్త గీత ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.