Jammu kashmir Bank Employee: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. కుల్గామ్ జిల్లా మోహన్పొరాలో బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది.. అక్కడకు చేరుకొని ముష్కరుల కోసం వేట ప్రారంభించారు.
రాజస్థాన్‌కు చెందిన విజయ్‌కుమార్.. కశ్మీర్‌లోని మోహన్పొరాలో ఉన్న ఇలాఖీ దేహతి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు గురువారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో టీవీ నటి, టీచర్‌ను కాల్చిచంపిన ముష్కరులు.. ఇప్పుడు బ్యాంకు మేనేజర్‌పై దాడి చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు.. జమ్ముకశ్మీర్‌లో గురువారం మరో ఘటన జరిగింది. షోపియాన్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు కశ్మరీ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇది గ్రనేడ్ దాడా..? లేకపోతే బ్యాటరీ పేలిందా..? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.
ఇవీ చదవండి:
అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి.. రూ.లక్షల్లో సంపాదన.. ముఠా అరెస్ట్!