మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మూడు రోజుల్లో 40 మంది.. సైబర్ మోసాల బారిన పడ్డారు. ఫేక్ లింక్‌లను క్లిక్ చేసి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. బ్యాంక్ కేవైసీని అప్డేట్ చేయాలని.. లేకపోతే ఖాతాలు బ్లాక్ అవుతాయనే మెసేజ్‌తో ఈ లింక్‌లు వస్తున్నాయి. తొందరపడి ఆ లింక్‌లు క్లిక్ చేసిన వారంతా డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల్లో మహారాష్ట్ర టీవి నటి కూడా ఉన్నారు.
ముంబయి పోలీసులు తరుచుగా ఈ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు ఈ మోసాలకు గురువుతూనే ఉన్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారు. మొత్తం 40 మందికిపైగా సైబర్ మోసాలకు గురై.. డబ్బులు పోగొట్టున్నట్లు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఎంపిక చేసిన నంబర్లకు సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ మెసేజ్‌ను పంపిస్తున్నారు. కేటుగాళ్లు ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే.. కేవైసీ/ పాన్‌కార్డ్ వివరాలు అప్డేట్ చేసుకోవాలనే సందేశం వస్తోంది. లేకపోతే బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. అది క్లిక్ చేసిన తరువాత ఓ ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అనంతరం ఆన్లైన్ దరఖాస్తులో వారి వ్యక్తిగత వివరాలు.. కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ నింపమని చెబుతారు. దీంతో వారి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.
టీవీ నటి సైతం..
ముంబయికి చెందిన టీవి నటి శ్వేతా మేనన్ కూడా.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కూడా ఆ మోసపూరిత లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నట్లు వారికి తెలిపారు.
"గురువారం నాకు ఓ ఫేక్ లింక్ మెసేజ్ వచ్చింది. అది బ్యాంక్ వారే పంపించారని భ్రమ పడ్డాను. అనంతరం ఆ లింక్‌ను క్లిక్ చేశాను. వెంటనే ఓ ఫేక్ పోర్టల్ ఓపెన్ అయింది. ఆన్లైన్ దరఖాస్తులో నా కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడిగింది. ఆ దరఖాస్తును పూర్తిగా నింపాను. ఆ తరువాత ఓ మహిళ నాకు ఫోన్ చేసింది. తాను ఒక అధికారినని చెప్పింది. మీ నంబర్‌కు ఓటీపీ వచ్చిందని.. అది తనకు చెప్పమని అడిగింది. చెప్పిన అనంతరం నా ఖాతాలో నుంచి 57వేల 636 రూపాయలు డెబిట్ అయ్యాయి" అని నటి శ్వేతా మేనన్ తెలిపారు.
ఇదే పద్ధతిలో చాలా మంది డబ్బులను పోగొట్టుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసగాళ్లు పంపించే బోగస్ లింక్‌లను ఎవ్వరు క్లిక్ చేయోద్దని హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ ఏమైనా ఉంటే నేరుగా సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.