Bandi Sanjay as BJP National General Secretary : ఎన్నికల ముంగిట పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడమే లక్ష్యంగా సంస్థాగతంగా మార్పులు చేస్తున్న బీజేపీ.. మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందరికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరికొన్ని కీలక పదవులు కట్టబెడుతోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ జాతీయ పదాధికారుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటుదక్కింది.
Bandi Sanjay New Post : బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే బండి సంజయ్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్(ఏపీ), జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌ను కొనసాగించనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెల్లడించింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
బండికి ప్రమోషన్.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తరువాత పార్టీలో జోష్ తగ్గిందని.. బండి సంజయ్‌ని ఎందుకు తొలగించారంటూ పార్టీ శ్రేణులు జాతీయ నాయకత్వాన్ని ప్రశ్నించాయి. తెలంగాణలో పార్టీకి వన్నె తెచ్చిన బండి సంజయ్‌ని ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుండి తొలగించడం వల్ల నష్టం వాటిల్లుతుందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌ని తొలగించడాన్ని విపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు తప్పుబట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ నాయకత్వం దిద్దుబాటు చర్యలో భాగంగా తాజాగా బండి సంజయ్‌కు ప్రమోషన్ కల్పించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ నియామకం పట్ల రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్‌కు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రమంత్రి పదవి ఎవరిని వరించనుందంటే : బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిన తరువాత కిషన్ రెడ్డి స్థానంలో ఆయనకు కేంద్రమంత్రి పదవి కట్టబెడతారని ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక కేంద్ర మంత్రి పదవి ఊహాగానాలకు తెర పడినట్లైంది. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లు లోక్‌సభ సభ్యులుగా కొనసాగుతుండగా.. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్‌లు ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో వీరిలో తెలంగాణ నుంచి కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి మొదలైంది.
Organizational Changes in Telangana BJP : బీజేపీ శాసనసభాపక్ష నేతతో పాటు.. జీహెచ్ఎంసీ, కరీంనగర్ కార్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్ వంటి పదవులను భర్తీ చేస్తారని సమాచారం. పదవుల అంశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి అసంతృప్తులు, అలకలకు ముగింపు పలకడంతో పాటు.. పార్టీ శ్రేణుల్ని పూర్తిగా ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నం చేసేలా అధిష్ఠానం కార్యాచరణను అమలు చేయనుందని తెలిసింది.
ఇవీ చదవండి :