Babies switched at birth: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి తన బిడ్డకు మూడేళ్లు దూరమైంది. తనకు ప్రాణం లేని శిశువును అప్పగిస్తే.. న్యాయపోరాటం చేసింది. చివరకు డీఎన్ఏ పరీక్షలు, పోలీసుల దర్యాప్తు తర్వాత.. కోర్టు ఆదేశాలతో మూడేళ్లకు తన శిశువును తాను దక్కించుకుంది. ఈ సంఘటన అసోంలోని బార్పేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది: బార్పేట్కు చెందిన నజ్మా ఖనమ్ అనే మహిళ 2019, మే 3వ తేదీన నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను ఐసీయూకు తరలించారు. శిశువును చిన్నారుల సంరక్షణ గదిలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత నజ్మా ఖనమ్ కుటుంబ సభ్యులకు మృత శిశువును తీసుకొచ్చి అప్పగించారు ఆసుపత్రి సిబ్బంది. ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు జన్మనిచ్చిందని, చనిపోయే అవకాశమే లేదని వారు చెప్పారని నజ్మా ఖనమ్ న్యాయవాది అబ్దుల్ మన్నన్ తెలిపారు.
"మూడు రోజుల తర్వాత.. ఆసుపత్రిలో ఆ రోజు ఎవరెవరు ప్రసవం అయ్యారని నజ్మా ఖనమ్ కుటుంబ సభ్యులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు దాదాపు ఒకే పేరుతో నజ్మా ఖనమ్, నజ్మా ఖాతున్లు.. బిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. అందులో ఒక శిశువు జన్మించిన వెంటనే మరణించింది. ఈ విషయంపై నజ్మా ఖనమ్ కుటుంబ సభ్యులు బార్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 363 ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎన్ఏ పరీక్షలకు అనుమతించాలని బార్పేట్ జిల్లా కోర్టులో 2020, అక్టోబర్ 8న దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బిడ్డను తన తల్లికి అప్పగించారు."
- అబ్దుల్ మన్నన్, న్యాయవాది
ఇద్దరు మహిళలు దాదాపు ఒకే పేరుతో ఉండటం, ఒకే రోజు బిడ్డలకు జన్మనివ్వటం వల్లే పొరపాటు జరిగినట్లు తమ దర్యాప్తులో తేల్చారు పోలీసులు. చనిపోయిన శిశువుకు బదులుగా.. మరో బిడ్డను గొస్సాయ్గావ్కు చెందిన నజ్మ ఖాతున్‌కు అప్పగించినట్లు తేల్చారు. దీంతో బిడ్డను సొంత తల్లికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: పెళ్లికి నో చెప్పిందని 'వివాహిత'పై యాసిడ్ దాడి
పెళ్లిలో లక్కీ డ్రా.. గెస్ట్‌ను వరించిన అదృష్టం.. గిఫ్ట్ ఏంటంటే...