Baba Shivanand Padma Shri: బాబా శివానంద్‌జీ.. ప్రస్తుతం దేశమంతటా చర్చించుకుంటున్న పేరు! వందేళ్ల పైపడిన వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆయన ఇటీవల రాష్ట్రపతి చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అవార్డు స్వీకరణకు వేదిక వద్దకు ఆయన హుషారుగా నడిచివెళ్లిన తీరుతోపాటు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ప్రణమిల్లిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. మరి ఇంతకీ శివానంద్‌జీ ఆరోగ్య రహస్యమేంటి? ఆయన ఏం తింటారు? ఎంతసేపు నిద్రిస్తారు? ఎన్నేళ్లుగా యోగా చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఆయన ‘ఈటీవీ భారత్’ ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు.
ఈటీవీ భారత్: పద్మశ్రీ పురస్కారం దక్కడాన్ని ఎలా భావిస్తున్నారు?
శివానంద్‌జీ: అది కేవలం నా ఒక్కడికి దక్కిన గౌరవం కాదు. యోగా రంగంలో అవార్డు వచ్చింది కాబట్టి భారత పౌరులందరికీ చెందుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం గడిపేలా అందరిలో స్ఫూర్తి నింపుతుంది. ఈ పురస్కారానికి అర్హుడినని భావించి నన్ను ఎంపిక చేసినవారికి కృతజ్ఞుడిని.
ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యమేంటో చెప్తారా?
Baba Shivanand life Style: యోగా వల్లే నేను ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. యోగా సాధనతో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగితే జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ప్రతిఒక్కరూ రోజూ కనీసం ఆరు గంటలు నిద్రించాలి. ఆహారం తక్కువ తీసుకోవాలి. నూనెలు ఎక్కువగా వాడొద్దు. కోరికల్ని నియంత్రణలో ఉంచుకుంటే సమస్యలు దూరమవుతాయి. చాలామందిలో అది కొరవడుతోంది.
మీ దినచర్యను వివరిస్తారా?
రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాను. కాలకృత్యాలు తీర్చుకొని కనీసం అరగంటపాటు యోగా చేస్తాను. (ఒకప్పుడు 3 గంటలపాటు చేసేవాణ్ని. వయసు పైబడ్డాక అరగంటకు పరిమితమయ్యాను) స్నానం వంటివి పూర్తిచేసుకొని పూజ చేస్తాను. ఉదయం గోరువెచ్చని నీరు తాగుతాను. రెండు రొట్టెలు, ఒక కాయగూర అల్పాహారంగా తీసుకుంటాను. ఆ తర్వాత- నా దగ్గరకు వచ్చేవారితో మాట్లాడతాను. యోగా సాధన చేసేలా వారిని ప్రోత్సహిస్తాను. ఉడకబెట్టిన పదార్థాలను సాయంత్రం ఆహారంగా తీసుకొని.. రాత్రి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తాను. నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను గురువు వద్దకు తీసుకెళ్లారు. ఆయన్నుంచి ప్రేరణ పొంది యోగా చేయడం ఆరంభించాను. ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నా.. యోగాకు మాత్రం దూరం కాలేదు.
ఇంత వయసున్న మీరు 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటేశారు. అంతకుముందు ఎందుకు ఓటుహక్కును వినియోగించుకోలేదు?
2014కు ముందు నేను ఒక్కచోట స్థిరంగా ఉండేవాణ్ని కాదు. దేశమంతాసంచరించేవాణ్ని. అందుకే ఓటు వేయలేదు. అప్పట్లో నాకు శాశ్వత చిరునామా కూడా లేదు. అయితే- ఓటుహక్కు చాలా విలువైనది. అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి.
రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మీరు ప్రణామం చేసిన తీరు అందర్నీ ఆకర్షించింది. దానిపై మీరేమంటారు?
వ్యక్తుల కంటే హోదాకు నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. హిందూ సంస్కృతిని పాటిస్తూ వారికి ప్రణామం చేశానంతే. ఆరోగ్యం ఎలా ఉందంటూ.. అవార్డు ప్రదానం చేసే సమయంలో రాష్ట్రపతి నన్ను అడిగారు. కాస్త వినికిడి సమస్య తప్ప మరే ఇబ్బందీ లేదని ఆయనకు చెప్పాను.
శివానంద్‌జీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి వాసి. అక్కడి కబీర్‌నగర్‌లో.. ఒకే ఒక్క పడకగది, హాలు, వంటగది ఉండే చిన్ని ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రివారు ఆయనకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి.. ఎలాంటి అనారోగ్యమూ లేదని నిర్ధారించారు.
ఇదీ చదవండి: 'బంగాళాఖాతాన్ని వారధిగా మార్చుదాం.. మన లక్ష్యాన్ని సాధిద్దాం'