కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు అవినీతికి కేసులో ఊరట లభించింది. యడియూరప్ప కేసు విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ప్రైవేట్ పిటిషన్‌దారు అభ్యర్థన మేరకు విచారణ జరపాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ యడియూరప్ప సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణపై స్టే విధించింది. యడియూరప్ప అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది.
ఆయన ఫిర్యాదుతో..
టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా.. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్‌ను నిందితులుగా పేర్కొన్నారు.
అయితే.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తొలుత అబ్రహం పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. టీజే అబ్రహం పిటిషన్‌ను పునఃపరిశీలించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించగా.. స్పెషల్ కోర్టు మరోసారి విచారణ జరిపింది. యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.