Azadi Ka Amrit Mahotsav: వ్యాపారం కోసం భారత్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి కలకత్తాను స్థావరంగా చేసుకున్న ఆంగ్లేయులు అదే రాజధానిగా పాలన కొనసాగించారు. ఈస్టిండియా కంపెనీ హయాం ముగిసి బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత (1858) నుంచి రాజధాని మార్పుపై ఆలోచనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైస్రాయ్ చార్లెస్ కానింగ్... రాజధానిని మధ్యభారతానికి మారుద్దామన్నాడు. కొంతమంది ఆంగ్లేయ అధికారులు జబల్‌పుర్‌ను సూచించారు. మరికొందరు డార్జిలింగ్ అనీ... ఇంకొందరు అలహాబాద్, ఆగ్రా, దిల్లీ, బొంబాయిల పేర్లు చెప్పారు. కానీ ఏదీ తేలలేదు. 1864 లో వైస్రాయ్‌గా వచ్చిన లార్డ్ జాన్ లారెన్స్ భారత్‌లో అడుగు పెట్టకముందే షరతులు విధించాడు. భారత్‌లో ఎండలకు తాళలేనని... కాబట్టి ఆరునెలలు తాను శీతల ప్రాంతాల్లో ఉంటానంటూ అనుమతి తీసుకొని వచ్చాడు. జనవరిలో పదవిలోకి వచ్చిన లారెన్స్ నాలుగునెలలు కాగానే వేసవి వేడిని భరించలేనంటూ... శిమ్లాకు వెళ్లాడు. తనతో పాటు ఆంగ్లేయ సర్కారు అంతటినీ అక్కడికి మార్చాడు. దాదాపు 500 మంది సిబ్బంది, వారి కార్యాలయాలు, కాగితాలు అన్నీంటినీ శిమ్లాకు తరలించారు. ఆ కాలంలోనే ఈ తాత్కాలిక తరలింపునకు రూ.4లక్షలు ఖర్చయ్యాయి.
కలకత్తా నుంచి 1200 మైళ్ల దూరంలోని మారుమూల హిమాలయ కొండప్రాంతానికి రాజధాని, పాలన, వైస్రాయ్... అంతా తరలి వెళ్లటం అందరినీ ఆశ్చర్యపర్చింది. కానీ తర్వాత అది ఏటా ఓ తంతులా మారిపోయింది. శిమ్లా ఆంగ్లేయుల వేసవి రాజధానిగా మారింది. 'కలకత్తాలో ఐదు రోజుల్లో చేసే పనిని శిమ్లాలో ఉంటే ఒక్కరోజులో చేయొచ్చు. రాజధాని ఇలా ఆరునెలలు కలకత్తా, ఆరునెలలు సిమ్లాలో ఉంటే హాయిగా ఉంటుంది' అంటూ లారెన్స్ సమర్థించుకున్నాడు. అప్పటి నుంచి ఏటా బ్రిటిష్ సర్కారుకు శిమ్లా వేసవి రాజధానిగా మారింది. 1911లో దిల్లీని రాజధానిగా ప్రకటించినా... వేసవి రాజధాని సంస్కృతిని మాత్రం 1939 దాకా కొనసాగిస్తూనే వచ్చారు. యావత్ పాలన యంత్రాంగం శిమ్లాకు తరలివెళ్లేది. వైస్రాయ్‌తో పాటుగా మిలటరీ, దాదాపు 5వేల మంది పాలన సిబ్బంది, వారి భార్యలు, పిల్లలు, సేవకులు ఇలా అంతా వెళ్లేవారు. గుర్రాలు, ఏనుగులు, ఎడ్లబండ్లు, పల్లకీల్లో... కలకత్తా నుంచి రోజుల పాటు ప్రయాణం చేసి శిమ్లా చేరుకునేవారు. రైల్వే లైను వచ్చాక ఈ ప్రయాణం కాస్త సులభమైంది.
తెల్లవారి విలాసాలకు తగ్గట్లుగా మార్కెట్లు, మాల్‌లు, కట్టడాలు, భవనాలు, హోటళ్లు, క్లబ్‌లు వెలిశాయి. విదేశాల నుంచి వ్యాపారులు వచ్చి తెల్లవారి కోసం దుకాణాలు తెరిచారు. శిమ్లాను ఓ ఆంగ్లేయ పట్టణంగా తయారు చేశారు. విలాస కేంద్రం అనే పేరు రాకుండా ఉండేందుకు సైనిక ప్రధాన కార్యాలయం, వైస్రాయ్, భారత ప్రభుత్వ కార్యాలయం, ముద్రణ, అన్ని శాఖల కార్యాలయాలు తెరిచారు. సిబ్బందికి శిమ్లా భత్యం పేరిట ప్రత్యేకంగా చెల్లించేవారు. బ్రిటిష్ సర్కారు తీరు గమనించి అనేక మంది భారతీయ మహారాజులు శిమ్లాలో భవంతులు నిర్మించుకున్నారు. కానీ వేసవిలో ఆ భవంతులను వాడుకోవాలంటే... మహారాజులు కూడా ఆంగ్లేయ సర్కారు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. మహారాజుల భవంతులను స్వాధీనం చేసుకొని ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తమవారికి అద్దెకు ఇచ్చుకునేవారు ఆంగ్లేయ అధికారులు. స్థానిక భారతీయులను కూలీలుగా వాడుకునేవారు. డబ్బులివ్వకుండా వారితో వెట్టి చాకిరీ చేయించుకునేవారు. వైస్రాయ్ తన యంత్రాంగాన్ని అంతటినీ శిమ్లాకు మారుస్తుంటే... ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్‌లు కూడా అదే బాట పట్టారు. మద్రాస్ రాష్ట్ర గవర్నర్ ఊటీ, బొంబాయి గవర్నర్ పుణె మహాబలేశ్వర్, బెంగాల్ సర్కారు డార్జిలింగ్‌కు వేసవిలో రాజధానులను మార్చటం మొదలెట్టారు.
పేరుకు రాజధాని అయినా తీరుకు ఇవన్నీ వేసవి విడుదులు, విలాస కేంద్రాలుగానే సాగేవి. భారత జాతీయోద్యమ నేతలు వీటిని ఆంగ్లేయుల పిక్నిక్ కేంద్రాలుగా విమర్శించారు. బ్రిటన్ ఆర్థిక మండలి సభ్యుడు డగ్లస్ ఫ్లీట్‌వుడ్ సైతం....'భారత ప్రభుత్వం ఏటా ఆరునెలలు సముద్రమట్టానికి 8 వేల మీటర్ల ఎత్తుకు వెళ్లి పర్వతాల్లో హాయిగా పడుకుంటుంది. భారతీయ సమాజంతో, ప్రజలతో సంబంధాలు తెంచుకుంటుంది. అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. భారతీయుల అనేక సమస్యలకు ఇదే కారణం' అని విమర్శించారు. ఎవరేమనుకున్నా ఆంగ్లేయులు తమ అనేక కీలక నిర్ణయాలను ఈ శిమ్లా విడిది రాజధాని కేంద్రంగానే తీసుకున్నారు. దేశవిభజన, సరిహద్దులకు సంబంధించిన కీలకమైన అనేక సమావేశాలు, చర్చలు కూడా శిమ్లా వేదికగానే జరిగాయి.
ఇదీ చూడండి:
భాజపా ఎంపీ కారుపై బాంబు దాడి.. 'కశ్మీర్ ఫైల్స్' చూసొస్తుండగా!