Azadi Ka Amrit Mahotsav: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చాక అహింస ఉద్యమాలతో తమకు పరీక్ష పెడుతున్న గాంధీజీని ఎలా కట్టడి చేయాలా అని చూస్తున్న బ్రిటిష్ సర్కారు 1922 మార్చి 10న ఆయన్ను అరెస్టు చేసింది. దిల్లీలో కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్‌కు రాగానే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలపై గాంధీని అదుపులోకి తీసుకున్నారు. యంగ్ ఇండియా పత్రికలో రాసిన మూడు వ్యాసాలను ఆధారంగా చూపుతూ రాజద్రోహ నేరం మోపారు. అరెస్టు చేసి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. ఆయనతో పాటు యంగ్ ఇండియా ప్రింటర్ శంకర్‌లాల్ బంకర్‌ను కూడా జైల్లో పెట్టారు. గాంధీజీకి ఖైదీ నంబర్ 6357 కేటాయించి ఒంటరిగా ఉంచారు. చిరునామా సబర్మతి, వృత్తి రైతు, నేత కార్మికుడిగా జైలు రికార్డుల్లో రాశారు. ఆయన ఛాతిపై ఎడమవైపున తెల్లటి మచ్చ, మెడపై గోధుమరంగు మచ్చ ఉన్నట్లు పుట్టుమచ్చలు నమోదు చేశారు.
రాజద్రోహ నేరం మోపినప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఆదరణ, బయట వ్యక్తమవుతున్న ఆందోళనను గమనించిన ఆంగ్లేయులు గాంధీజీతో జైలులో జాగ్రత్తగా వ్యవహరించారు. ఇతర ఖైదీలతో కలపకుండా ప్రత్యేక గదిలో ఉంచారు. 1895లో ఆంగ్లేయ సర్కారు ప్రత్యేకంగా ఈ జైలులో ఓ మూల విశాలమైన స్థలంలో ఎనిమిది భారీ గదులను నిర్మించింది. ప్రముఖ ఖైదీలను ఉంచేందుకు వీటిని కట్టారు. తర్వాతి కాలంలో వీటిలోనే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, కస్తూర్బాను కూడా బంధించారు. మిగిలిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించినా.. తొలిసారి జైలుకు తీసుకు వచ్చిన గాంధీ విషయంలో మాత్రం కాస్త మృదువుగానే ఉన్నారు. కారణం- బయట వెల్లువెత్తుతున్న ప్రజా స్పందనే! గాంధీకి ఏం జరిగినా పరిస్థితి అల్లకల్లోలమవుతుందని గుర్తించి జైలులో ఆయనున్న గది తాళం తీసేశారు. ఆవరణలో స్వేచ్ఛగా తిరగనిచ్చారు. కోరుకున్నప్పుడు సందర్శకులను అనుమతించారు.
గాంధీజీ కూడా భారత్‌లో తన తొలి జైలు జీవితాన్ని ఆనందంగా అనుభవించారు. మౌలానా అబ్దుల్ బారీ, తన స్నేహితుడు సి.ఎఫ్.ఆండ్రూస్‌కు మార్చి 13న రాసిన లేఖల్లో.. "సబర్మతి జైలును స్వేచ్ఛా గృహంలా ఆస్వాదిస్తున్నా. ఎట్టకేలకు మౌనంగా, ప్రశాంతంగా ఉండే అవకాశం చిక్కింది. జైల్లో ఉన్నట్లు లేదు. ఇంట్లో ఉన్నట్లే ఉందిక్కడ. సందర్శకులు రావటం ఆగిపోతే మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి నా అరెస్టును చూసి ఆవేదన చెందకండి. ఆనందపడండి" అన్నారు. తన వ్యక్తిగత సహాయకుడు మహదేవ్ దేశాయ్‌కి రాసిన లేఖలో.. "నా అసలైన సేవ ఇక్కడే ఆరంభమవుతుంది. జైలు నిబంధనలను కఠినంగా పాటించటం ద్వారా ఇష్టాయిష్టాలపై నియంత్రణ సాధిస్తా. అలా రోజూ పొందే పూర్ణత్వ ప్రభావం బయటికొచ్చాక కూడా ఉంటుంది" అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంపై జైల్లోంచే మాంచెస్టర్ గార్డియన్‌కు గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్చి 18న విచారణ పూర్తయ్యాక ఆయనకు ఆరేళ్లు, శంకర్‌లాల్ బంకర్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో, బయటా జన సందోహాన్ని చూసి భయపడ్డ ఆంగ్లేయ అధికారులు తీర్పు తర్వాత నేరుగా మళ్లీ సబర్మతి జైలుకే గాంధీని తీసుకొచ్చారు. మార్చి 20న అర్ధరాత్రి ప్రత్యేక రైలులో ఆయన్ను పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి: హిమగిరుల్లో ఆంగ్లేయుల ఆటకట్టించిన రైతులు.. పట్టుబట్టి మరీ!