ETV Bharat / bharat

అర్జీలే అస్త్రంగా.. ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం

Azadi ka Amrit Mahotsav: ఏవైనా సమస్యలు వస్తే.. అన్యాయం పైచేయి సాధిస్తే బాధితులు.. గ్రామాధికారులకు, ఆపై అధికారులకు, అక్కడా న్యాయం జరగకుంటే రాజుకు విన్నవించేవారు. దేశం ఈస్టిండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లాక అంతా తలకిందులైంది. పాలకులు మన ప్రాంతం వాళ్లు కాదు. మన భాషా రాదు. మన రాత తెలియదు. మనకు అందుబాటులోనూ ఉండరు. ఏంచేయాలో తోచక ప్రతిఒక్కరూ అల్లాడేవారు. ఆదుకునే వారి కోసం ఆకాశం వైపు చూసేవారు. అలాంటి సమయంలో ఎడారిలో ఒయాసిస్సులా లక్ష్మీనరసు శెట్టి తెరపైకి వచ్చారు. మద్రాసు నుంచి ఇంగ్లండుకు అర్జీల బాణాలను అలుపెరగకుండా వదిలారు. నాటి భారతీయులకు సమస్యలపై నిరసన తెలిపే రీతిని.. పోరాడే దారిని చూపించారు.

azadi
azadi ka
author img

By

Published : Apr 15, 2022, 8:35 AM IST

Gazulu Lakshminarasu Chetty: గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాసులో 1806లో ధనిక కుటుంబంలో జన్మించారు. తండ్రి సిద్ధులు శెట్టి వస్త్ర వ్యాపారి. వసతులు లేని కారణంగా ఉన్నత విద్యను చదవలేకపోయిన లక్ష్మీనరసు... చిన్నప్పటి నుంచే రాజకీయ చర్చల్లో చురుకుగా పాల్గొనేవారు. చదువు పూర్తవగానే వ్యాపారంలోకి అడుగుపెట్టి, తండ్రి తదనంతరం అంతా చూసుకున్నారు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో పత్తి అమ్మకాల ద్వారా బాగా సంపాదించారు. ఆ తర్వాత దేశసేవకు తన సమయాన్ని వెచ్చించారు.

మత మార్పిడులపై తీవ్ర వ్యతిరేకత: ఆంగ్లం చదువుకున్న వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని అప్పట్లో మద్రాస్‌ గవర్నర్‌ ప్రకటించడంతో హిందువులు తమ పిల్లలను మిషనరీ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. ఆ విద్యార్థులను క్రైస్తవంలోకి మారుస్తుండటంతో లక్ష్మీనరసు గవర్నరుకు అర్జీలు ఇచ్చి, కోర్టులో కేసులు వేశారు. క్రైస్తవంలోకి మారిన పిల్లలకు హిందూ తల్లిదండ్రుల ఆస్తులపై సమాన హక్కులు ఉంటాయన్న ఇండియన్‌ లా కమిషన్‌(1845) ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ప్రజలను కూడదీసి ఒత్తిడి తేవడంతో గవర్నర్‌ దిగొచ్చారు. మద్రాసు యూనివర్సిటీ పాఠశాలలో బైబిల్‌ను పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టడానికి 1846, 1853 సంవత్సరాల్లో గవర్నర్‌ చేసిన ప్రయత్నాలను లక్ష్మీనరసు విజయవంతంగా అడ్డుకున్నారు.

gajula lakshmi narasu shetty
గాజుల లక్ష్మీ నరసు శెట్టి

కంపెనీ దురాగతాలపై వేధింపుల కమిటీ: శిస్తులు చెల్లించలేని రైతులను కంపెనీ అధికారులు పెడుతున్న చిత్రహింసలను చూపడానికి లక్ష్మీనరసు అర్జీలు పెట్టి... ఆంగ్లేయ ఎంపీ డెన్సీ సేమర్‌ను భారత్‌కు రప్పించారు. ఆయన్ని గ్రామాల్లో తిప్పారు. రైతుల బాధలను చూసి చలించిన ఆ ఎంపీ... "మిట్ట మధ్యాహ్నం వంగోబెట్టి రైతుల వీపులపై బండలు పెట్టడం, చేతివేళ్ల గోళ్లలో సూదులు గుచ్చడం, మోకాలి మడతల్లో కంకరరాళ్లు పెట్ట్టి నొక్కడం, కొరడాలతో కొట్టడం, గాడిదల తోకలకు రైతుల జుట్టును ముడేసి బజార్లలో ఈడ్చడం వంటి అత్యంత అమానవీయ చర్యలు జరుగుతున్నాయి" అని 1854లో బ్రిటన్‌ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దురాగతాలపై వెంటనే విచారణ జరపాలని పార్లమెంటు 'వేధింపుల కమిటీ'ని వేసింది. లండన్‌ నుంచి మద్రాసుకు వచ్చిన కమిటీ సభ్యులు కంపెనీ దుశ్చర్యలను గుర్తించారు. ఆర్థిక, వ్యవసాయ, విద్య, మత సంబంధ విషయాల్లో భారతీయుల మీద జరుగుతున్న దాడిపై పోరాడటానికి లక్ష్మీనరసు 1844లో క్రిసెంట్‌ అనే పత్రికను స్థాపించారు.

మద్రాసు విశ్వవిద్యాలయానికి బీజం: తన సహచరుడు శ్రీనివాసపిళ్లైతో కలిసి మద్రాసులో ఆంగ్ల కళాశాలను స్థాపించాలని గవర్నర్‌కు లక్ష్మీనరసు విన్నవించారు. అర్జీపై 70 వేల మందితో సంతకాలు చేయించారు. ఆయన కృషితోనే 1841లో హైస్కూల్‌ ఆఫ్‌ మద్రాసు యూనివర్సిటీ పేరిట ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. దాన్నే 1857లో మద్రాసు విశ్వవిద్యాలయంగా మార్చారు.

మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌: ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని ఎంతలా పీక్కుతింటోందో ప్రజలకు వివరించేందుకు లక్ష్మీనరసు 1852లో మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌ స్థాపించారు. దీని ద్వారా వివిధ సందర్భాలలో బ్రిటన్‌ పార్లమెంటుకు అర్జీలు సమర్పించారు. భారతదేశ పాలన పగ్గాలను ఈస్టిండియా కంపెనీ నుంచి తప్పించాలని, మిషనరీల ఆగడాలను కట్టడి చేయాలని, భారతీయులు తమ కష్టాలను నేరుగా విన్నవించుకునేందుకు ఆంగ్లేయ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాలని, కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన చేసిన సేవలతో 1863లో మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు నియమితులయ్యారు. ధనిక కుటుంబంలో పుట్టిన లక్ష్మీనరసు విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరివిగా దానధర్మాలు చేయడంతో జీవిత చరమాంకంలో పేదరికం అనుభవించారు. అయినా ప్రజాసేవను మానలేదు. చివరికి 1868లో తుదిశ్వాస విడిచారు. ఆయన పరమపదించడానికి ఒక ఏడాది ముందే మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌ను రద్దు చేశారు.

ఇదీ చూడండి: హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.