కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కోల్‌కతా జాతీయ సమావేశంలో మహిళలతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించిన సుభాష్ చంద్రబోస్... చరిత్ర సృష్టించారు. తన ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్‌ఏ-ఇండియన్ నేషనల్ ఆర్మీ)లోనూ మహిళలకు పెద్దపీట వేశారు. రెండో ప్రపంచ యుద్ధం తొలినాళ్లలో బ్రిటన్‌ను ఓడించిన జపాన్... సింగపూర్‌ను కైవసం చేసుకుంది. నేతాజీ వెంటనే జర్మనీ నుంచి 1943 జులైలో సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్, మలేసియాల్లో ఇంగ్లండ్ తరఫున పోరాడుతూ పట్టుబడిన భారతీయ సైనికులతోపాటు కొందరు స్థానిక భారతీయులతో ఐఎన్‌ఏ సిద్ధమైంది. జులై 5న 12 వేల మందితో సమావేశం ఏర్పాటైంది. దీనికి స్థానిక భారతీయ పౌరులనూ అనుమతించారు. "మహిళలు కూడా ముందుకొచ్చి పాల్గొనకుంటే ఈ సమరం అసంపూర్ణం అవుతుంది. రాణీ ఝాన్సీలక్ష్మీ బాయి పేరిట మహిళా దళాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా" అని బోస్ ప్రకటించారు. రెజిమెంట్ బాధ్యతలను 28 ఏళ్ల డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్‌కు అప్పగించారు. ఆమె మద్రాసులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆంగ్లేయుల కొలువులో పనిచేయడం ఇష్టం లేక సింగపూర్ వచ్చారు. గైనకాలజిస్టుగా పేరు గడించారు. వివిధ దక్షిణాది భాషలనూ నేర్చుకున్నారు. వీటికితోడు అక్కడి భారత రాజకీయ బృందాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఒక్క రోజులోనే రెజిమెంట్ సిద్ధం.. నేతాజీ సభలకు మంచి స్పందనైతే వచ్చిందిగానీ.. ముందుకొచ్చే మహిళలు లేరు. సింగపూర్, మలేసియాల్లో చాలామంది సంప్రదాయ భారతీయ కుటుంబాల వారే ఉన్నారు. మధ్య తరగతి వారేమో తమ పిల్లలతో తుపాకులు పట్టించడానికి ఇష్టపడలేదు. 1943 జులై 12న జరిగే సభలో బోస్ పాల్గొనాల్సి ఉంది. దీన్నే ఝాన్సీలక్ష్మీ రెజిమెంట్ ప్రారంభోత్సవంగా మార్చాలనుకున్నారు డాక్టర్ లక్ష్మి. జులై 11న సింగపూర్‌లోని భారతీయ స్వాతంత్య్ర బృందం ఛైర్మన్ ఎల్లప్పతో కలసి.. ఇరవై మంది యువతులను సమీకరించారు. వారికి రోజంతా ఐఎన్‌ఏ బృందంతో సాయుధ శిక్షణ ఇప్పించారు. మరునాటి సభలో వారంతా చీరకట్టులోనే ఆయుధాలతో బోస్‌కు గౌరవ వందనం సమర్పించారు. ఇది చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఝాన్సీ రెజిమెంట్‌కు డాక్టర్ లక్ష్మిని కమాండర్‌గా నియమించారు.
భారత్‌ను చూడకున్నా.. కానీ.. మరుసటి రోజుకల్లా రెజిమెంట్‌లోని 20 మందిలోంచి అయిదుగురు వెళ్లిపోయారు. స్థానిక పత్రికల్లో, రేడియోల్లో ఝాన్సీ రెజిమెంట్ గురించి ప్రకటనలు ఇచ్చారు. వీటికితోడు లక్ష్మి.. సింగపూర్, మలేసియాల్లోని భారతీయులందరి ఇళ్ల తలుపు తట్టారు. ఝాన్సీ రెజిమెంట్ ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించారు. ఫలితంగా రెండు నెలల్లో 150 మంది అమ్మాయిలు ముందుకొచ్చారు. వీరిలో చాలామంది ఎన్నడూ భారత్‌ను చూడనివారే కావడం గమనార్హం. అయినా భారతావనిపై మమకారంతో, బోస్‌పై నమ్మకంతో సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. 22 అక్టోబరుకల్లా 160 మందితో తొలి శిబిరం ఆరంభమైంది. కొద్ది రోజుల్లోనే ఈ సంఖ్య 500కు చేరింది. డాక్టర్ లక్ష్మి... కెప్టెన్ లక్ష్మి అయ్యారు. సింగపూర్ వేదికగా... బోస్ ప్రధానిగా స్వతంత్ర భారత ప్రవాస ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో డాక్టర్ లక్ష్మీస్వామినాథన్‌ను మంత్రిని చేశారు. తర్వాత కౌలాలంపూర్, బర్మాల్లోనూ ఝాన్సీ రెజిమెంట్లు వెలిశాయి. జపాన్ సైనికులు మొదట ఈ రెజిమెంట్‌ను అవహేళన చేసినా తర్వాతి కాలంలో వారి క్రమశిక్షణ చూసి గౌరవించారు. ఇంఫాల్, బర్మా యుద్ధాల్లో కీలక పాత్రపోషించిన ఝాన్సీ రెజిమెంట్ సభ్యులు... ఆసుపత్రుల్లోనూ సేవలందించారు. బ్రిటన్ చేతిలో జపాన్‌కు ఎదురుదెబ్బలు తగిలి, రంగూన్ చేజారాక ఝాన్సీ రెజిమెంట్ సేవలను బోస్ నిలిపేశారు. మహిళలందరినీ వారి కుటుంబాల వద్దకు క్షేమంగా పంపించారు. మలేసియా బృందాన్ని స్వయంగా తీసుకెళ్లారు. తమను వెనక్కి పంపించి వేస్తారని తెలిసి... 'మేం రక్తమిస్తాం... భారత్‌కు స్వాతంత్య్రమూ తెస్తా'మని మహిళా సైనికులు బోస్‌కు రక్తాక్షరాలతో ఉత్తరం రాశారు.
ఇదీ చూడండి: భారత వాయుసేన ఆవిర్భావం వెనుక ఆ నలుగురు!