Azadi Ka Amrit Mahotsav: ప్రేమ్‌ఖన్నా తాత పశ్చిమ పంజాబ్‌లో ప్రభుత్వ సివిల్ సర్జన్. తండ్రి నాటి బ్రిటిష్ రైల్వేలో చీఫ్ డివిజినల్ ఇంజినీరు. రైల్వేలకు చేసిన సేవలు, విధేయతకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రాయ్ బహదూర్ బిరుదునిచ్చింది కూడా. పుట్టుకతోనే సంపన్నుడైనప్పటికీ... ప్రేమ్ ఆలోచనలు నాటి ధనవంతుల పిల్లలకు కాస్త భిన్నంగా సాగేవి. చిన్నప్పటి నుంచే వివిధ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవాలను అధ్యయనం చేసేవారు. ఈ అలవాటే ఆయన్ని విప్లవకారుల సానుభూతి పరుడిగా మార్చింది. ఆర్థికంగా స్థిరపడిన వీరి కుటుంబం ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో కోటలాంటి భవంతిని నిర్మించింది. ప్రేమ్ అక్కడే ఉండేవారు. తండ్రి పలుకుబడితో రైల్వేలో గుత్తేదారు లైసెన్స్ లభించింది. దీంతో... బ్రిటిష్ ప్రభుత్వంలో రైల్వే ఇతర భారీ కాంట్రాక్టు పనులు చేపట్టేవారు. ఈ క్రమంలో దొంగలు, దోపిడీదారుల నుంచి తరచూ ఇబ్బందులు ఎదురవుతుండటంతో... ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం తుపాకీ లైసెన్సు ఇచ్చింది.
గాంధీనే ఎదిరించిన ధైర్యం
Prem kishan khanna: షాజహాన్‌పుర్ కార్యకర్తలతో కలిసి ప్రేమ్‌కిషన్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేవారు. కాంగ్రెస్‌లోని అతివాదులకు ఆయన మద్దతుండేది. చౌరీచౌరాలో హింసాత్మక ఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరిస్తున్నట్లు గాంధీజీ ప్రకటించటంతో ప్రేమ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గయలో నిర్వహించిన కాంగ్రెస్ సభకు వాలంటీర్లతో వెళ్లి గాంధీపై నిండు సభలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే... కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను సమర్థించకూడదని గాంధీ విస్పష్టం చేయడంతో ఆయన నిరాశకు గురయ్యారు.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: పుస్తకాలు అమ్మి ఆయుధాలు కొని..
తుపాకీ దోస్తుకు ఇచ్చి
Hindustan republic association: హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్ ప్రసాద్ బిస్మిల్‌తో ప్రేమ్ కిషన్‌కు స్నేహం కుదిరింది. దేశానికి తుపాకీ గొట్టం ద్వారానే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మిన విప్లవ సంస్థ అది. బ్రిటిష్ వారిచ్చిన లైసెన్స్‌తో కొన్న తన తుపాకీని తరచూ బిస్మిల్‌కు ఇచ్చేవారు ప్రేమ్! తద్వారా... ఆయన ఖాతాలో విప్లవవాదులు ఎక్కువ మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసేవారు. ఆ క్రమంలోనే... బిస్మిల్ బృందం కకోరి వద్ద రైలును ఆపి... అందులో వెళుతున్న ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టింది. ఆ సంఘటనలో వాడిన ఆయుధాల్లో ప్రేమ్ తుపాకీ కూడా ఉన్నట్లు తేలింది. పోలీసులకు అప్రూవర్‌గా మారిన బనారసీ లాల్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ విషయం బయటకు పొక్కింది. తుపాకీ ప్రేమ్‌కు చెందినదే కాకుండా... కొనుగోలు చేసిన తూటాల లెక్క తేలకపోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. దీంతో... సాయం చేసిన స్నేహితుడి ప్రాణానికి హాని కలగొద్దనే ఉద్దేశంతో.... తానే లైసెన్సుతోపాటు ప్రేమ్ తుపాకీని ఎత్తుకెళ్లినట్లు బిస్మిల్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని నమ్మని పోలీసులు... బిస్మిల్‌కు వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారమని ప్రేమ్‌పై ఒత్తిడి తెచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ఆయన తండ్రి ద్వారా కూడా చెప్పించారు. కానీ ప్రేమ్ మాత్రం... భారతావని కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న విప్లవవీరులకు ద్రోహం చేయటానికి అంగీకరించలేదు. అప్రూవర్‌గా మారి హాయిగా బయట ఉండటానికి బదులు... అయిదేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించటానికే ఇష్టపడ్డారు. అలాగే కష్టపడ్డారు కూడా!
అమర స్నేహితులకు ఘన నివాళి
Kakori martyrs: కకోరీ రైలు కేసులో ఉరికొయ్యకు వేలాడిన బిస్మిల్ బృందాన్ని ప్రేమ్‌కిషన్ జీవితాంతం మరవలేదు. జైలు నుంచి విడుదలయ్యాక కాంగ్రెస్ సభ్యుడిగా స్వాతంత్య్ర పోరాటంలో కొనసాగారు. అనంతర కాలంలో షాజహాన్‌పుర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 'కకోరీ అమరుల' పేరిట ఆరు విద్యా సంస్థలను సొంత ఖర్చుతో స్థాపించారు. బిస్మిల్ స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేసేందుకు అవివాహితుడిగానే మిగిలారు. తన వందో పుట్టినరోజుకు కేవలం ఆరు నెలల ముందు 1993, ఆగస్టు 3న తుది శ్వాస విడిచారు.
ఇవీ చూడండి: