ETV Bharat / bharat

చరిత్రగతి మార్చిన ఉద్యమం, గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యం

బ్రిటీషు వారిని తరిమికొట్టి స్వతంత్రం సంపాదించడానికి 200 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. అనేక మంది ప్రజలు త్యాగాలు చేశారు. గాంధీజీ నాయకత్వంలో సాగిన ఈ పోరాటం ఎన్నో ముఖ్యమైన ఘట్టాలున్నాయి. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో పోరాటం సాగిన తీరు, బలిదానాలు, సంస్కరణలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎ.వి.రాజమౌళి ప్రత్యేక కథనం

mahatma gandhi in freedom struggle
mahatma gandhi in freedom struggle
author img

By

Published : Aug 15, 2022, 8:33 AM IST

  • రోజూ మనం నోట్లో పెట్టుకునే ముద్ద ఆషామాషీగా వచ్చేది కాదు. ఎక్కడో ఎవరో రైతు నారు పోసి, నీరు పెట్టి, కష్టనష్టాలకు ఓర్చి... పండించిన గింజ మన ఇంటికి చేరి ఒంట్లో ప్రాణశక్తిగా మారుతుంది!
  • మన స్వాతంత్య్రం కూడా అలాంటిదే. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం అలవోకగా వచ్చింది కాదు. నిరంతర పోరాటాల ఫలితం!
  • ఇవాళ మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువుల వెనక ఆగిపోయిన ఊపిరిలెన్నో! ఉరితాళ్లకు వేలాడిన ప్రాణాలెన్నో! మనం అనుభవిస్తున్న సౌకర్యాల వెనక కమిలిన కుటుంబాలెన్నో! కనిపించని కష్టాలెన్నో! ఆవిరైన కన్నీళ్లెన్నో... వినిపించని వేదనలెన్నో! ఆస్తులు, సుఖాలను కాదనుకున్న త్యాగాలెన్నో!
  • 75వ వసంతోత్సవాన, అమరులిచ్చిన ‘అమృతాన్ని’ జుర్రుతున్న సమయాన... స్వాతంత్య్రం.... అంటే ఏంటి? అది లేకుంటే ఏంటో? ... అర్థం చేసుకోవాలి భారత్‌ ఎలా ఉండేది? ఎలా మిగిలింది? ఏం కోల్పోయిందో?... శోధించాలి
  • ప్రపంచంలోని ప్రతి ఒక్కడి కన్నూ పదేపదే ఎందుకని మన దేశంపై పడింది? ఎంతమంది దోచుకుపోయినా ఈ దేశం ఎలా బతికుందో? ... తెలుసుకోవాలి
  • స్వాతంత్య్రం వచ్చింది సరే... ఆంగ్లేయులు నింపిన ఆత్మన్యూనత నుంచి, వలస పాలన వాసనల నుంచి... బ్రిటిష్‌ పద్ధతుల నుంచి, ఆంగ్ల భాషపై మోజు నుంచి స్వేచ్ఛ వచ్చిందా? .... అని ప్రశ్నించుకోవాలి!
  • ఆనందోత్సాహాల మధ్యే ఆ ఆత్మపరీక్షకు సిద్ధ పడితే... 200 ఏళ్లు తెల్లవాడి చేతిలో బానిసలవ్వటానికి కారణం ఆంగ్లేయుల బలమో, ఆయుధమో కాదనీ... మన అనైక్యత, అసూయలు, అంతఃకలహాలేనని అవగతమవుతుంది!
  • బహుళత్వం... భిన్నత్వం... ఏకత్వం... సమ్మిళితత్వం మన దేశ జీవనాడులని అర్థమవుతుంది. ఆ స్పృహే మనల్ని అనుక్షణం... స్వాతంత్య్ర విలువను గుర్తించేలా, మళ్లీ తప్పటడుగులు వేయకుండా ఉండేలా స్వరాజ్యంలో సురాజ్యం సాధించేలా నడిపిస్తుంది!

ఆంగ్లేయులను తరిమికొట్టడానికి రెండు వందల ఏళ్లపాటు ఆసేతు హిమాచలం అనుక్షణం పోరాడింది. హింసో అహింసో... తిరుగుబాటో మరోటో... రూపం ఏదైనా భారతావని ఎన్నడూ అశక్తంగా ఆగలేదు. శక్తియుక్తులను కోల్పోలేదు. పోరాటం ఆపలేదు. అబలలు అనుకున్న వారి నుంచి అంతఃపుర స్త్రీల వరకు... అడవుల్లో ఆదివాసీల నుంచి... ఆధునిక చదువులు చదువుకున్నవారి దాకా... మతాలు, కులాలు, పార్టీలు, సంస్థలు, సంస్థానాధీశులు... ఉన్నవారు లేనివారు... దశాబ్దాలు, అలుపెరగని పోరాటం సాగించారు. భారత స్వాతంత్య్ర సమరం అనేక పాయల సంగమమై... వివిధ రంగాల, వ్యక్తుల, ఉద్యమాల సమ్మేళనమై సాగింది. జాతిపిత గాంధీ మహాత్ముడి దిశానిర్దేశంలో స్వేచ్ఛను సాధించింది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో పోరాటం సాగిన తీరు, బలిదానాలు, సంస్కరణలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎ.వి.రాజమౌళి ప్రత్యేక కథనం...

మనం ఎలా పరాధీనమయ్యాం?: వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి రాజుల మధ్య కలహాలు సృష్టించి, కుటుంబంలో ఒకరి వేలితో మరొకరి కన్ను పొడిపించిన బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశంపై పట్టు సాధించింది. వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ... అవసరమైతే అణచివేస్తూ కొనసాగిన కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడక్కడ ప్రతిభావంతులైన వ్యక్తులు పోరాటయోధులు, గిరిజన వీరులు ఎదురు తిరిగినా... కంపెనీ ముందు వారి బలం సరిపోలేదు.

'తిలకం' దిద్దిన పోరాటం: ఆంగ్లేయులను వినతుల(మహజర్లు) ద్వారా ప్రాధేయపడటం బాలగంగాధర్‌ తిలక్‌ లాంటి ఉద్యమకారులకు నచ్చలేదు. వినాయక చవితి, విజయదశమిలాంటి ఉత్సవాలలో అశేష జన వాహినిని ఉద్దేశించి వారు ఉత్సాహ, ఉత్తేజ భరిత ప్రసంగాలు చేస్తూ జాతిని స్వాతంత్య్రం సాధించుకోవాలనే ఆలోచన దిశగా మళ్ళింపజేశారు. ఆలోచన, ఆవేశాలతో మిళితమైన వీరి కార్య ప్రణాళిక వేళ్లూనుకోవడాన్ని గమనించిన బ్రిటిష్‌ పాలకులు... విభజించి పాలించే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ భావాలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కుల, మత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాటి ఫలితమే 1905లో జరిగిన బెంగాల్‌ విభజన. స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా రాజుకుంటున్న రాష్ట్రాన్ని తూర్పు, పశ్చిమ బెంగాల్‌గా విభజించారు. వెన్వెంటనే బాల్‌, లాల్‌, పాల్‌ త్రయం దేశవ్యాప్తంగా పర్యటించింది. ఫలితంగా వందేమాతరం నినాదం మారుమోగింది. తమ తప్పిదాన్ని తెలుసుకున్న పాలకులు బెంగాల్‌ విభజనను 1911లో వెనక్కి తీసుకున్నారు.

దేశమంతటా సహాయ నిరాకరణ: రాజ్యాంగ సంస్కరణలు చేస్తున్నామని చెబుతూ... మరింత కఠిన చట్టాలను రూపొందించేలా తయారు చేసిన రౌలత్‌ చట్టానికి (విచారణ లేకుండా శిక్ష, వారెంటు లేకుండా అరెస్టు) వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం (1920) దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను అమితంగా ఆకర్షించింది. ప్రజల మనోభావాలను గుర్తించని, గౌరవించని ప్రభుత్వ చట్టాలకు సహాయ నిరాకరణ చేయటం ధర్మబద్ధమని ఉద్యమం సాగించారు. అయితే చౌరీచౌరాలో ఉద్యమకారులు అదుపుతప్పి ఒక ఠాణాను తగలబెట్టడం వంటి హింసాయుత చర్యకు పాల్పడ్డారని తెలిసి ఖిన్నులయ్యారు. ఉన్నత లక్ష్యం ఎంత ముఖ్యమో సమున్నత మార్గమూ అంతే ముఖ్యమని హింసాయుత మార్గాల ద్వారా వచ్చే స్వాతంత్య్రం కలకాలం మనజాలదని, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని ఒక్క పిలుపుతో ఆపివేశారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే సైద్ధాంతిక పునాదుల ఆధారంగా చేసే పోరాటంలో స్థితప్రజ్ఞుడికి ప్రశంసలు, విమర్శలు సమానమేనని తన ఆచరణ ద్వారా తన మౌనం, నిరాహార దీక్షల ద్వారా దేశానికి సందేశం ఇచ్చారు. పోరాటానికి తన సమూహ సభ్యులను సన్నద్ధం చేయటం ఎంత ముఖ్యమో అహింసాయుత సిద్ధాంతాల ఆధారంగా పోరాటం చేయడం అంతే ముఖ్యమని... వీటి ఉల్లంఘన ఆ ఉద్యమ ఫలితాలను కలుషితం చేస్తుందనే శాశ్వత పాఠాన్ని తన తరానికి తర్వాతి తరాలకు గాంధీజీ అందించారు.

జలియన్‌వాలాబాగ్‌లో పాశవిక చర్య: రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌ రాష్ట్ర అమృత్‌సర్‌లోని జలియన్‌ వాలాబాగ్‌ ప్రాంగణంలో సమావేశమైన ఉద్యమకారులపై స్థానిక పోలీసు అధికారి జనరల్‌ డయ్యర్‌ విచక్షణారహితంగా జరిపిన కాల్పులతో, ప్రజల ఆగ్రహావేశాలు, ఉద్యమ స్ఫూర్తి మిన్నంటాయి. దమన కాండలకు పాల్పడుతున్న బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించకూడదని గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించారు. జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, ప్రజాక్షేత్రంలో రావాల్సిన మార్పులను సూచించడం, ప్రజల నాడిని అర్థం చేసుకోవడం, బాధ్యతాయుతంగా స్పందించడం, ప్రజా సంక్షేమం, ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు మార్గదర్శనం... ఇలా గాంధీ చేపట్టిన ప్రతి ఉద్యమంలో ఒక స్పష్టమైన ప్రణాళిక, నిజాయితీ, దార్శనికత కనిపిస్తాయి. అంతేకాక తన ఆలోచనలను, విభిన్న విషయాలపై తన అభిప్రాయాలను అత్యంత తర్కబద్ధంగా యంగ్‌ ఇండియా, హరిజన్‌ వంటి పత్రికలలో స్పష్టంగా వివరించేవారాయన.

మనదేశం నుంచి 200 ఏళ్ల పాలనాకాలంలో ఆంగ్లేయులు పన్నుల రూపంలో దోచుకెళ్లిన మొత్తం ధనం విలువ రూ.45 లక్షల కోట్లు.

.

తెల్లవాడి అహంకారానికి తొలి హెచ్చరిక: రాజ కుటుంబాలలోని అంతర్గత సమస్యలను, బలహీన వ్యక్తిత్వమున్న వాటి సేనాధిపతులను ప్రలోభపెట్టి ఈస్టిండియా కంపెనీ దేశంలో అత్యధిక భాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. భారతజాతికి దాస్య శృంఖలాలు వేసింది. అయితే బ్రిటిషర్ల దాస్యానికి తల ఒగ్గలేని... ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, నానాసాహెబ్‌ లాంటి కొందరు రాజులు, రాణులు, రాకుమారులు, రాజ్య వారసులు, సేనాధిపతులు దేశంలోని విభిన్న ప్రాంతాల్లో 1857లో ఒకేసారి ప్రథమ స్వాతంత్య్ర తిరుగుబాటును ప్రారంభించారు. బ్రిటిష్‌ వారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. వీరికి కంపెనీలో పనిచేస్తున్న భారతీయ సిపాయిలు కూడా తోడయ్యారు. అయితే ఆంగ్లేయుల సుశిక్షిత సైన్యం, ఆధునిక ఆయుధాల ముందు... భారతీయ పోరాట యోధుల బలం సరితూగలేకపోయింది.

లండన్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఆరుగురు సభ్యులు, 60 వేల పౌండ్ల మూలధనంతో 1600 సంవత్సరంలో ఏర్పాటైన ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని 110 ఏళ్లు పాలించింది. బ్రిటన్‌ ప్రభుత్వం 1858 నుంచి నేరుగా 89 ఏళ్లు ఏలింది.

శాంతియుత జన సమూహంపై కాల్పులు జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైంది. దాంతో బ్రిటన్‌ ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించింది. మొత్తం 376 మందికి రూ.22.66 లక్షల పరిహారం ఇచ్చినట్లు రికార్డుల్లో రాశారు.

.

అసంతృప్తిని చల్లార్చే ప్రయోగాలు: ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం(1857) తర్వాత భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన నుంచి బ్రిటిష్‌ రాణి ఆధీనంలోకి వెళ్లింది. భారతీయుల్లో నిగూఢంగా ఉన్న అసంతృప్తిని, ఆత్మక్షోభను చల్లార్చడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం తమ ప్రతినిధులైన వైస్రాయిల ద్వారా పరిపాలనలో కొన్ని సంస్కరణలు, వెసులుబాట్లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే బ్రిటిష్‌ సివిల్‌ సర్వెంట్‌ ఎ.ఓ. హ్యూమ్‌ ప్రతిపాదన మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌ను ప్రారంభించి, తొలి అధ్యక్షుడిగా ఉమేష్‌ చంద్ర బెనర్జీని ఎన్నుకున్నారు. ఆరంభంలో కొందరు భారతీయ విద్యావేత్తలు, ఉద్యోగులు కలిసి బ్రిటిష్‌ ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ, వినతుల ద్వారా ప్రజల సమస్యను పరిష్కరించే ప్రయత్నించేవారు. ఈ ప్రయత్నంలో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్‌, లాలా లాజ్‌పత్‌రాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌(బాల్‌, లాల్‌, పాల్‌) లాంటి ప్రముఖులు భారతజాతి ఉద్ధరణ దిశగా పనిచేశారు.

1885 డిసెంబరులో 28-31 తేదీల మధ్య ముంబయిలో ఓ సంస్కృత కళాశాలలో 72 మంది ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్‌ ఆవిర్భవించింది.

.

మువ్వన్నెలు మురిసిన వేళ: దేశంలో ఉద్యమం క్రమంగా ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలోనే జర్మనీ, జపాన్‌ దేశాల రాజ్యవిస్తరణకాంక్షల కారణంగా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందులో బ్రిటన్‌తోపాటు దాని మిత్రదేశాలు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడటం, భారతీయుల అనుమతి లేకుండానే దేశాన్ని యుద్ధంలోకి దించడంతో గాంధీజీ నేతృత్వంలో ప్రజలంతా భగ్గుమన్నారు. ఇక ‘విజయమో వీర స్వర్గమో’ (డూ ఆర్‌ డై) అనే నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమం(1942) ప్రారంభమైంది. అదే సమయంలో జపాన్‌ సహాయంతో భారత్‌కు స్వాతంత్య్రం సమకూర్చి పెట్టేందుకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఉద్యుక్తులయ్యారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి, ‘చలో దిల్లీ’ అంటూ నినదిస్తూ బర్మా (నేటి మయన్మార్‌) మీదుగా కవాతు ప్రారంభించారు. అంతలోనే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌, జర్మనీలు ఓడిపోయాయి. సింగపూర్‌ నుంచి జర్మనీకి వెళ్లే సమయంలో విమాన ప్రమాదంలో సుభాష్‌ చంద్రబోస్‌ అమరుడయ్యారు. ఆయన లేకపోయినా... ఆయన ఇచ్చిన ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదం భారత యువతను ఉత్సాహపరచి, ఉర్రూతలూగించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రేరేపించింది. ఎట్టకేలకు భారత్‌ను వీడిపోవాలని నిర్ణయించిన బ్రిటన్‌ మన గుండెపై విభజన గాయం చేసింది. చివరికి 1947 ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు సమకూరాయి.

వాటిపై ఎందుకంత మోజు?: అప్పటికింకా మంచు తయారీని కనిపెట్టలేదు. ఐరోపా దేశాల్లో ఆహార పదార్థాలను నిలువ చేయడానికి, వాటికి అదనపు రుచిని ఇవ్వడానికి భారతీయ సుగంధ ద్రవ్యాలను కలిపేవారు. అరబ్బులు మధ్యవర్తులుగా ఉండి విక్రయించే సుగంధ ద్రవ్యాల ధరలు మండిపోయేవి. వాటిని సొంతంగా సమకూర్చుకునే లక్ష్యంతో భారత్‌కు సముద్రమార్గాన్ని శోధిస్తూ పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా 1498 మే 20న కాలికట్‌లో కాలుపెట్టాడు. అప్పుడు మనదేశాన్ని మొఘల్‌ చక్రవర్తులు పాలిస్తున్నారు. వారి నుంచి వ్యాపార అనుమతి తీసుకుని పోర్చుగీసులు, ఫ్రెంచ్‌, డచ్చి, బ్రిటిషర్లు ఇలా ఒకరి తర్వాత ఒకరొచ్చారు.

నాటి మన వ్యవస్థ ఇలాగుండేది: అప్పటి మన భారతీయుల్లో వ్యక్తిగత క్రమశిక్షణారాహిత్యం, సామాజిక అనైక్యత, గత వైభవమనే చట్రంలో ఇరుక్కుపోవడం, సమర్థించుకోలేని అంధ విశ్వాసాలు, వ్యక్తి జీవన గమనానికి అవసరమైన కనీస విషయ పరిజ్ఞానలేమి, నిరక్షరాస్యత, మారుతున్న కాలానికి మారని వ్యవస్థలు, పరస్పర అసూయ-ద్వేషం, పరస్పరం కలహించుకోవడం వంటి అవలక్షణాలు ఉండేవి. ఆనాటి రాజ్యాల మధ్య కూడా అనైక్యత, అసూయ, ఈర్ష్య, పరస్పర విద్వేషాలు ఉండేవి.

నవ యువకుల రక్తతర్పణం: ఆంగ్లేయుల పాలనలో దమనకాండను, అన్యాయాన్ని తట్టుకోలేని నవ యువకులు... శాంతియుత, అహింసాత్మక సిద్ధాంతాలతో స్వాతంత్య్రం రాదని, బ్రిటిష్‌ దురాగతాలకు వారి పద్ధతుల్లోనే సమాధానం చెప్పాలని పోరాటంలోకి దూకారు. ప్రజలకు కంటకులుగా పరిణమించిన పలువురు ఆంగ్లేయ అధికారులను అంతమొందించారు. అలాంటి ఉద్యమకారుల్లో సావర్కర్‌ సోదరులు, ఖుదిరాం బోస్‌, ప్రఫుల్ల చాకీ, అరబిందో ఘోష్‌, జితేంద్రనాథ్‌ ముఖర్జీ, రాష్‌ బిహారీ బోస్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సూర్య సేన్‌, సర్దార్‌ భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు, యశ్‌పాల్‌ తదితరులు తమ వీరోచిత, త్యాగాల ద్వారా స్వాతంత్య్రోద్యమ జ్యోతిని నిత్యం రగులుతూ ఉండేలా చూశారు.

సామాజిక సంస్కరణ: ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత అనేకమంది సంఘసంస్కర్తలు తమ ఆలోచనలతో భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నించారు. స్వామి వివేకానంద, ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌, జ్యోతిబాపులే, డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌, సుబ్రహ్మణ్య భారతి, ద్వారకానాథ్‌ గంగూలీ, వినోబాభావే, వినాయక దామోదర్‌ సావర్కర్‌, మహదేవ్‌ గోవింద రనడే, కందుకూరి వీరేశలింగం, ఈశ్వర చంద్రసేన్‌ లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన సంస్కర్తలు భారతీయ సామాజిక రుగ్మతలను సమూలంగా పెకలించటానికి తమతమ స్థాయిలో కృషి చేశారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్త్రీవిద్య, స్త్రీసమానత్వం, మహిళా హక్కులు, దళిత బలహీన వర్గాల అభ్యున్నతి, సమానత్వం తదితర సామాజిక సమతుల్యత వెనుక ఈ మహానుభావుల పరిశ్రమ దాగుంది.

దక్షిణాఫ్రికాలో ఉదయించిన సూరీడు: దేశ ప్రజల బలాలు, బలహీనతలను అర్థం చేసుకుంటూ, సందర్భోచితంగా పట్టువిడుపు ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపే నాయకత్వం అవసరం అనుకుంటున్న తరుణంలో.... దక్షిణాఫ్రికాలోని భారత, నల్లజాతి ప్రజల హక్కుల రక్షణ కోసం తన సత్యం, అహింస అస్త్రాలను దిగ్విజయంగా ప్రయోగించి, స్వదేశానికి మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ తిరిగొచ్చారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి చుక్కానిగా నిలిచారు. మనసులో నైర్మల్యం, మాటలో నైశిత్యం, తోటి వారి పట్ల మమతతో కూడిన ఆత్మీయ దృక్కోణం, త్రికరణ శుద్ధి, ప్రత్యర్థితో పోరాడే సమయంలోనూ సత్యం ఎటుంటే విజయం అటుండాలనే సైద్ధాంతిక సచ్చీలత కలిగిన గాంధీజీ... బానిసత్వాన్ని, దాని మూల కారణాలను అర్థం చేసుకోవడానికి దేశమంతా సామాన్యుడిలా పర్యటించారు. సామాన్యులకు అర్థం కాని భాషలో, దూరంగా ప్రతిపాదించే తీర్మానాలు... వారి సమాహారమైన భారతదేశాన్ని దాస్యం నుంచి విముక్తి చేయలేవని గ్రహించారు. సామాన్యుల జీవితాన్ని తనదిగా చేసుకున్నారు. నాటి సామాజిక సమస్యలైన అస్పృశ్యత, బాల్యవివాహాలు, అపరిశుభ్రత, అవిద్య లాంటి లోపాలను సంస్కరించుకొని, మన ఇల్లును చక్కబెట్టుకుంటేనే ప్రత్యర్థితో బలాల ఆధారంగా, మన సిద్ధాంతాల పునాదిపై పోరాడగలమని వ్యూహం రచించారు.

.

రాజ్యాంగబద్ధ సవాల్‌: 'బ్రిటిష్‌ చట్టం కంటే నా ఆత్మసాక్షినే ఉన్నత చట్టంగా భావిస్తా. బ్రిటిష్‌ చట్టాలు నా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా అనిపిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘిస్తా. ఆ చట్ట ఉల్లంఘన నేరం కింద నాకు అత్యంత కఠినమైన శిక్ష విధించుకోవచ్చు'(బ్రిటిష్‌ ప్రభుత్వానికి గాంధీజీ మొట్టమొదట విసిరిన రాజ్యాంగబద్ధ సవాల్‌ ఇది)

.

రైతు బాంధవుడిగా మహాత్ముడి విజయం: రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బిహార్‌లోని చంపారన్‌(1917)కు తన భార్య కస్తూర్బాతో కలిసి క్షేత్రపర్యటనకు వెళ్లిన గాంధీజీ అక్కడ ఊరూరా తిరిగారు. అన్నదాతల కుటుంబాలను స్వయంగా పరిశీలించారు. బ్రిటన్‌కు అవసరమైన నీలిమందు పంటను (వస్త్రాలకు రంగులు వేసే) భారత్‌లో పండించటం, దానికి సరైన ధర కల్పించకపోవడం, తిండి గింజలు మాని, నీలిమందును పండించాలని కఠిన నిబంధనలు అమలు చేయడం.. ఇవన్నీ రైతులను బానిసలుగా మారుస్తున్నాయని, వారి కుటుంబాలను ఆకలితో అలమటించేలా చేస్తున్నాయని ఎలుగెత్తారు. కఠిన నిబంధనలను మార్చాల్సిందేనని పట్టుబట్టి ప్రథమ విజయం సాధించారు. తర్వాత గుజరాత్‌లోని ఖేడా(1918)లో కరవు, కలరా, ప్లేగు వ్యాధులతో చిన్నాభిన్నమైన రైతులను... భూమిశిస్తు పెంచి, చెల్లించని వారిని హింసిస్తున్నందుకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలోనూ ఇదే తెగువ ప్రదర్శించి మరో విజయం సాధించారు. గుజరాత్‌లోని బర్దోలి(1928)లో ఇబ్బడిముబ్బడిగా పెంచిన పన్నులను ప్రభుత్వం మెడలు వంచి రైతుల కోరికకు అనుగుణంగా తగ్గింపజేశారు. గాంధీ సిద్ధాంతాలైన అహింస, సత్యాగ్రహాలను ఆరంభంలో ఎగతాళి చేసిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇక్కడే గాంధీజీకి అత్యంత నమ్మకమైన కుడి భుజంగా మారారు. శక్తిమంతమైన ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఐదేళ్లు కలిసికట్టుగా, బలంగా ఉద్యమిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని ఖిలాఫత్‌ ఉద్యమం (1919) ద్వారా విభిన్న మతాల వారిని ఐక్యపరచే ప్రయత్నం చేశారు.

మనిషి ప్రాథమిక అవసరాలైన తిండి, గుడ్డ, గూడు లేకుండా వారిని బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా నడిపించటం సాధ్యం కాదని గాంధీజీ ఆరంభంలోనే గ్రహించారు. చేయబోయే పనిపై స్పష్టత, వనరుల సమకూర్పు, సొంత పక్షంతోపాటు ప్రత్యర్థుల బలాబలాల బేరీజు... ఇలా అత్యంత వాస్తవిక దృక్కోణంతో క్షేత్రస్థాయి నుంచి స్వాతంత్య్రోద్యమాన్ని సత్యం, అహింస పునాదులపై నిర్మించుకుంటూ సాగించారు.

.

ఉప్పుతో నిప్పు రగిలించి..: భారత్‌లో రాజకీయ సంస్కరణలు, హక్కులతో కూడిన చట్టాన్ని తీసుకొస్తామని ప్రతిపాదించిన బ్రిటిష్‌ ప్రభుత్వం 1929లో ప్రతిపాదించిన రాజకీయ సంస్కరణలు ఆశాజనకంగా లేవు. పైగా భారతీయులకు స్వపరిపాలన అవకాశం ఆశించినంత కల్పించలేదు. దాంతో లాహోర్‌లో 1930 జనవరి 26న జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో సంపూర్ణ స్వరాజ్యమే తమ పోరాట లక్ష్యమని జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రకటించారు. దానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించే గురుతర బాధ్యతను గాంధీజీకి అప్పగించారు. దేశవ్యాప్తంగా జనులందర్నీ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించాలని మహాత్ముడు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఉప్పుపై పన్ను విధించటాన్ని నిరసిస్తూ, సంబంధిత శాసనాన్ని ఉల్లంఘించే హక్కు ప్రజలకుందని వక్కాణించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 1930 మార్చి 12న మొదలైన పాదయాత్ర ఏప్రిల్‌ 6న దండికి చేరింది. గాంధీజీ మొత్తం 388 కి.మీ. నడిచి, సముద్ర తీరాన ఉప్పు తయారు చేసి, ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించారు. ఆయన చూపిన బాటలో దేశవ్యాప్తంగా ప్రజలంతా నడిచారు. ఎంతోమంది సత్యాగ్రహులు పోలీసుల లాఠీలకు బలయ్యారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఉప్పు సత్యాగ్రహం ఒక గొప్ప మైలురాయి.

దండియాత్రలో మహాత్ముడి వెంట 78 మంది నడిచారు. మొత్తం 24 రోజులపాటు సాగిన పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా 1,350 పత్రికలు ప్రచురించాయి. ఈ సత్యాగ్రహాన్ని ప్రజల హక్కుల సాధనలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ కీర్తించాయి.

ఇవీ చదవండి: దేశ విభజన వేళ ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నివాళులు

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.