Azadi Ka Amrit Mahotsav: 1922లో రాజద్రోహం నేరంపై గాంధీజీని అరెస్టు చేసి... విచారణ అనంతరం ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. తొలుత ఆయన్ను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత... ప్రత్యేక రైలులో పుణెలోని యెరవాడ జైలుకు తరలించారు. ఆరేళ్లపాటు ఆయన ఆ కారాగారంలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఉన్నట్టుండి కడుపులో నొప్పి..
Gandhi in yerawada jail: అందరి దృష్టీ యెరవాడ జైలుపైనే కేంద్రీకృతమైంది. 1924 జనవరిలో గాంధీజీకి ఉన్నట్టుండి కడుపులో నొప్పి మొదలైంది. అది భరించలేనిదిగా మారటంతో ఆయన్ను వెంటనే పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. అపెండిసైటిస్‌గా తేల్చారు. అక్కడి నుంచి ఆంగ్లేయ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆయనకు శస్త్రచికిత్స చేయటం కోసం... ముంబయి నుంచి భారతీయ డాక్టర్లను వెంటనే రమ్మని కబురు చేశారు. ముంబయి నుంచి పుణెకు వచ్చే రైలులో వారిని ఎక్కించారు. కానీ... ఇక్కడ గాంధీజీ పరిస్థితి విషమించసాగింది. పుణె ఆసుపత్రిలో ఆయన్ను పరిశీలించిన బ్రిటిష్ సర్జన్ డాక్టర్ కర్నల్ మడోక్ తక్షణమే ఆపరేషన్ చేయాలని... ముంబయి నుంచి డాక్టర్లు వచ్చే దాకా ఆగితే ప్రమాదమని తేల్చిచెప్పారు. ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయమన్నారు. దీంతో... భారతీయులకంటే... ఆంగ్లేయ అధికారుల గుండెల్లో బండ పడింది. వెంటనే... సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అధ్యక్షుడు వి.ఎస్.శ్రీనివాస శాస్త్రి, పుణెలోని గాంధీ స్నేహితుడు డాక్టర్ పాఠక్‌లను పిలిపించారు. 'గాంధీజీకి బ్రిటిష్ ప్రభుత్వం మెరుగైన, అత్యుత్తమమైన వైద్య సేవలందిస్తోంది. ఒకవేళ జరగరానిదేమైనా జరిగితే... బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయొద్దు' అని ప్రకటన తయారు చేయాల్సిందిగా... వారిని ప్రాధేయ పడ్డారు.
'సరిచేయాల్సిన బాధ్యత మీదే'
Gandhi appendix surgery: పరిస్థితి తీవ్రత అందరికీ తెలిసిపోయింది. గాంధీజీకి ఏమైనా జరిగితే... యావత్ భారతావని భగ్గుమంటుందని! ఆంగ్లేయ సర్జన్ డాక్టర్ మడోక్ ఆధ్వర్యంలోనే శస్త్రచికిత్స... అందరిలోనూ గుబులు! ఆపరేషన్‌కు ముందు కాగితాలపై సంతకం తీసుకుంటుంటే... గాంధీజీ చేతులు వణకసాగాయి. "చూశారా నా చేతులెలా వణుకుతున్నాయో... వీటిని సరి చేయాల్సిన బాధ్యత మీదే" అని గాంధీజీ డాక్టర్ మడోక్‌తో అన్నారు. "ఓ... తప్పకుండా! మీలో టన్నులకు టన్నుల కొత్త బలాన్ని నింపుతాం" అంటూ ఆయన నవ్వుతూ బదులిచ్చారు.
ఆసుపత్రిలో కరెంట్ పోయినా..
అందరి ఉత్కంఠ మధ్య... ఆపరేషన్ మొదలైంది.... ఇంతలో ఆసుపత్రిలో కరెంట్ పోయింది! అక్కడున్న ఎవ్వరి రక్తపోటూ... సాధారణంగా లేని పరిస్థితి! వెంటనే లాంతర్లు ముట్టించారు. వాటి వెలుతురులోనే... 20 నిమిషాల పాటు శస్త్రచికిత్స సాగింది. ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్ మడోక్ బయటకి వచ్చి చెప్పటంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు. శస్త్రచికిత్సయితే... విజయవంతమైందిగాని... తర్వాత గాంధీజీ కోలుకోవటంలో ఇబ్బందులెదురయ్యాయి. దీంతో ఆలోచించిన ఆంగ్లేయులు... ఈయన్ను ఉంచుకొని అనుక్షణం ఆందోళన పడేకంటే... విడుదల చేయటం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు. ఆరేళ్ల జైలు శిక్షపై ఉన్న గాంధీజీని బేషరతుగా ముందే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడికంటే అక్కడికి ఆయన వెళ్లిపోవటానికి అనుమతిచ్చారు. అలా... ఆరేళ్ల జైలు శిక్ష కాస్తా... 22 నెలల్లోనే ముగిసింది. ముంబయిలో తన స్నేహితుడు శాంతికుమార్ మొరార్జీ ఇంట్లో కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని పూర్తి స్వస్థులయ్యారు గాంధీజీ!
ఇవీ చూడండి: