సిపాయిల తిరుగుబాటు (1857)(sepoy revolt in 1857) దెబ్బతో కంగుతిన్న బ్రిటన్ ప్రభుత్వం.. భారత్ పట్ల తన వైఖరిని మార్చుకుంది. బంగారు బాతులాంటి భారత్‌ను అంత త్వరగా వదులుకునేది లేదని స్పష్టంచేసింది. ప్రపంచ రాజకీయ చిత్రాన్నే మార్చేసిన కార్పొరేట్ ఈస్టిండియా కంపెనీ పాలనకు స్వస్తి చెప్పి.. నేరుగా తానే భారత పాలన పగ్గాలు చేపట్టింది. 1858, నవంబరు 1 నుంచి భారత్ నేరుగా బ్రిటిష్ రాచరికం కిందికి చేరింది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే తెల్లవారి విభజన రాజకీయం ఇక్కడి నుంచి ఊపందుకుంది.
అలహాబాద్‌లో నవంబరు 1 జరిగిన దర్బార్‌లో బ్రిటన్ రాణి విక్టోరియా పేరిట ప్రకటన వెలువడింది. "ఈ రోజు నుంచి భారత్‌లో బ్రిటిష్ రాచరికపు పాలన ఆరంభమవుతుంది. భారత్‌లోని సంస్థానాధీశులతో ఈస్టిండియా కంపెనీ చేసుకున్న ఒప్పందాలను అలాగే కొనసాగిస్తాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఏ సంస్థానాన్నీ స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదు. శాంతియుతంగా, అందరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సుపరిపాలన అందివ్వటమే మా లక్ష్యం. ఎలాంటి జాతి వివక్ష లేకుండా ప్రజలకు వారివారి సామర్థ్యాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చోటిస్తాం" అని ప్రకటించారు.
ఈ పాలన మార్పునకు కారణాలు బోలెడు. వ్యాపారం కోసం వచ్చి భారత్‌ను అనూహ్యంగా గుప్పిట పెట్టుకున్న ఈస్టిండియా కంపెనీ పాలన(East India Company rule) సజావుగా సాగుతుందనుకుంటున్న దశలో సిపాయిల తిరుగుబాటు అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ తిరుగుబాటు వేళ భారత్‌లో ఆంగ్లేయులు చాలామంది మరణించటంపై బ్రిటన్‌లో ఆందోళన చెలరేగింది. అలాగని భారత్‌ను వదులుకోవటానికి ఇష్టపడలేదు.
పాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన తొలి మార్పు.. సైన్యంలో. 80వేల మంది యూరోపియన్లతో తమ సేనల్ని బలోపేతం చేసుకొని.. స్థానిక భారతీయులను సిపాయిలుగా నియమించుకున్నారు. ఈ సిపాయిలను కూడా భిన్నప్రాంతాల నుంచి, వివిధ భాషలవారిని తీసుకుని రెజిమెంట్లుగా చేశారు. తద్వారా వారిలో ఐక్యత లేకుండా జాగ్రత్తపడ్డారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేశారు. భారతీయులెవరి వద్దా ఎలాంటి ఆయుధాలు ఉండకుండా, ఎవరినైనా ఎప్పుడైనా తనిఖీ చేసేలా చట్టం తీసుకొచ్చారు. ఎవరివద్దనైనా ఆయుధాలుంటే వాటిని అప్పగించేదాకా వారి ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకున్నారు. శిక్షలను కఠినతరం చేశారు. సిపాయిల తిరుగుబాటు అనుభవంతో ఆంగ్లేయ కుటుంబాలను భారతీయులకు దూరంగా ఉంచారు. ఇందుకోసం తెల్లవారి కోసం కొత్తగా కాలనీలు నిర్మించుకున్నారు.
అన్నింటికీ మించి.. తిరుగుబాటుకు కారణం హిందూ-ముస్లింల ఐక్యత అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించింది. విభజన రాజకీయం మొదలెట్టింది. మతాలనే కాకుండా.. హిందువుల్లోని కులాలు, ముస్లింలలో షియా-సున్నీల మధ్య చిచ్చు రగిల్చి పాలనపై పట్టుబిగించింది.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: మేనన్ తలకు పెన్-గన్!