గజపతులు కళింగ రాజులే అయినా... పూరీ జగన్నాథుడికి సేవకులుగా వ్యవహరిస్తారు. రథయాత్ర సందర్భంగా చీపురు పట్టుకొని ఊడుస్తారు. అలా తరతరాలుగా దేవాలయ నిర్వహణ బాధ్యత గజపతులదే. కానీ భారత్‌పై పట్టుబిగించి... వారసుల్లేని వారి రాజ్యాలను స్వాధీనం చేసుకోవటం ఆరంభించిన ఆంగ్లేయులు పూరీ ఆలయాన్ని కూడా అలాగే చేయాలని చూశారు. జగన్నాథాలయంపైనా పెత్తనానికి ఎత్తుగడలు వేశారు. వాటిని గజపతి వంశ రాణి సూర్యమణి పట్టమహాదేవి పట్టుదలతో వమ్ము చేశారు.

గజపతి రాజవంశీయుడైన రాజా వీరకిశోర్‌దేవ సతీమణే రాణి సూర్యమణి. 1859లో వీరకిశోర్‌దేవ మరణించారు. అప్పటికే వారు నాలుగేళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు. పిల్లవాడు మైనర్ అయినందున పూరీ ఆలయ బాధ్యతల్ని రాణి చేపట్టారు. అది ఇష్టం లేని ఆంగ్లేయ సర్కారు ఆమెను ఇబ్బంది పెట్టడానికి మందిర నిర్వహణలో సమస్యలు సృష్టించింది. సేవాయత్‌లు తిరగబడ్డారు. కానీ రాణి సూర్యమణి వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమించారు. ఇంతలో దత్త పుత్రుడు రాజా దివ్యసింగ్ దేవ పెద్దవాడవటంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన అసమర్థుడిగా తేలారు. ఆలయ నిర్వహణ దెబ్బతింది. ఇంతలో ఓ సాధువును చంపాడనే నెపంతో దివ్యసింగ్‌దేవను ఆంగ్లేయ సర్కారు అరెస్టు చేసి అండమాన్ జైలుకు తరలించింది. అంతేగాకుండా ఆలయాధికారిగా ఉన్న ఆయన నుంచి భారీ మొత్తం లాక్కోవాలని చూసింది. ఈ సంగతి పసిగట్టిన రాణి సూర్యమణి మళ్లీ తానే ఆలయ పగ్గాలు చేపట్టారు.
బ్రిటిష్ సర్కారు అందుకు అంగీకరించలేదు. రాణిని నామమాత్రపు అధికారిగా ఉంచి ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా ఆలయ నిర్వహణ చేయాలని చూసింది. రాణి సూర్యమణితో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బలప్రయోగంతో వెళితే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండటంతో... న్యాయస్థానం మార్గాన్ని ఆశ్రయించింది ఆంగ్లేయ సర్కారు. జిల్లా స్థాయి కోర్టులో సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం తరఫున ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ఓ వ్యక్తిని కూడా జడ్జి నియమించారు.
ఏం చేయాలో పాలుపోని రాణి సూర్యమణి ఆ కాలంలో ఒడిశాలో న్యాయ నిపుణుడిగా పేరొందిన మధుసూదన్ దాస్‌ను సంప్రదించారు. జగన్నాథుడి తరఫున కోర్టులో వాదించాలని కోరారు. క్రిస్టియన్ అయినప్పటికీ... జగన్నాథుడి హక్కులను రక్షించటం ఒడిశా ఆత్మగౌరవంగా భావించిన మధుసూదన్ దాస్ అందుకు అంగీకరించారు. వెంటనే కలకత్తా వెళ్లి హైకోర్టులో సీనియర్ న్యాయనిపుణులను సంప్రదించారు. కేసు వివరాలు విన్న వారంతా... ఆంగ్లేయ సర్కారును తట్టుకొని నెగ్గటం అసాధ్యమని... హైకోర్టులోనూ కేసు నిలవదని పెదవి విరిచారు. నిరాశ చెందని మధుసూదన్ స్వయంగా తానే రంగంలోకి దిగారు. సొంత డబ్బులతో పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ కేసు అందరి దృష్టినీఆకర్షించింది. మధుసూదన్ వాదన వినిపించేందుకు... కలకత్తా ధర్మాసనం మూడురోజుల సమయం కేటాయించింది. జగన్నాథుడి కేసు వినటానికి న్యాయస్థానం కిటకిటలాడింది. మూడు రోజుల సమయమిస్తే... మూడు గంటల్లోనే మధుసూదన్ దాస్ తన వాదనలను సమర్థంగా ముగించి కూర్చున్నారు. ఆయన వాక్చాతుర్యం, వాదనా పటిమ... చట్టాలపై ఉన్న అవగాహనను చూసి ముచ్చటపడ్డ హైకోర్టు న్యాయమూర్తులు... సాయంత్రం విందుకు పిలిచారు. మధుసూదన్ దాస్‌ను మిగిలిన న్యాయమూర్తులకు, కలకత్తా ప్రముఖులందరికీ పరిచయం చేసి మెచ్చుకున్నారు.
న్యాయవాదుల విందు తర్వాత... అప్పటి బెంగాల్ గవర్నర్ నుంచి మధుసూదన్‌కు ఆహ్వానం అందింది. జగన్నాథ ఆలయం విషయంలో రాణి సూర్యమణితో ప్రభుత్వం రాజీకి సిద్ధపడింది. 1888లో బ్రిటిష్ ప్రభుత్వం, పూరీ గజపతుల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం... ఆలయ ప్రతిష్ఠ, బాధ్యతల నిర్వహణ గజపతులకే అప్పగించారు. కేసు గెలిచాక, ఒడిశావాసిగా... జగన్నాథుడికి సేవ చేయటం తన బాధ్యతంటూ నయా పైసా తీసుకోలేదు మధుసూదన్ దాస్! బలమైన రాజు అండ లేకున్నా... 1860 నుంచి 1897 దాకా రాణి సూర్యమణి ఆంగ్లేయుల నాటకాలను వమ్ము చేస్తూ వచ్చారు. జగన్నాథుడిని కాపాడుకున్నారు.
ఇదీ చూడండి : ఝాన్సీ రాణి ఆంగ్లేయులపై విసిరిన 'ఆస్ట్రేలియా' విఫల పాచిక