ETV Bharat / bharat

స్వతంత్ర భారతంలో మహిళల విజయ ప్రస్థానం - womens role in development of india

ఆమె ఖ్యాతిగాంచని రంగం లేదు. సాధించని ప్రగతి లేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకుని విభిన్న వేదికలపై మహిళాలోకం వెలుగులీనుతోంది. స్వతంత్ర భారతంలో అతివల ప్రస్థానం ఆకాశమే హద్దుగా సాగుతోంది. వలసపాలన నుంచి విముక్తి పొందిన భారతావనిలో వనితాలోకం వడివడిగా పురోగమిస్తోంది. ఇందుగలరు అందులేరని సందేహం లేకుండా అతివలు అన్ని రంగాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు.

women empowerment in india
women empowerment in india
author img

By

Published : Aug 14, 2022, 10:31 AM IST

Updated : Nov 28, 2022, 11:45 AM IST

Womens role in development of india ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి.. దేశాన్ని రక్షించే త్రివిధ దళాల వరకు.. సర్పంచి నుంచి రాష్ట్రపతి పీఠం వరకు ప్రతి చోటా పురుషులకు దీటుగా వనితలు సత్తా చాటుతున్నారు. రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల్లో దేశ కీర్తిపతాకను రెపరెపలాడిస్తున్నారు. బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థలతో పాటు బహుళజాతి కంపెనీల అధిపతులుగానూ రాణిస్తున్నారు. ఈ విజయాలన్నీ అంత సులభంగా సాకారం కాలేదు. దశాబ్దాల కట్టుబాట్లపై పోరాడి.. వాటిని ఛేదించి సాధించారు మన మహిళామణులు. ఇది చాలదు. వారి కోసం దేశం ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్ష, అభద్రత స్త్రీల పురోగతికి అడ్డుగోడలుగా ఉన్నాయి. వీటిని తొలగించడంతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్ల వంటి సానుకూల నిర్ణయాలతో చేయూతనిస్తే.. మహిళలు మరింతగా ముందడుగు వేయగలరు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ.. అతివల ప్రగతి ప్రస్థానంపై ప్రత్యేక కథనం..

'ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు' అని స్వామి వివేకానంద ఏనాడో అన్నారు. ఆయన మాటలు అక్షర సత్యం. వనిత లేనిదే ఏ రంగమూ లేదు. ఆమె ఉంటేనే అభివృద్ధి సంపూర్ణమవుతుంది. స్వతంత్ర భారతావనిలో రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీడా, సినీరంగాల్లో మహిళలు చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు సాధించారు.. సాధిస్తున్నారు.

.
.
.

ఆమె.. ముందడుగేసింది!: స్వాతంత్య్రం వచ్చే నాటికి అంతంతమాత్రంగా ఉన్న మహిళల స్థితిని మెరుగుపరచడానికి రాజ్యాంగ రచనలోనే పునాది పడింది. కానీ.. అప్పటికే సమాజంలో పాతుకుపోయిన కట్టుబాట్లు.. మహిళను దశాబ్దాలపాటు గడప లోపలే ఉంచేశాయి. ఆమె అటు విద్యకు ఇటు ఆరోగ్యానికి దూరమై.. ప్రాణానికి భరోసా లేని దుస్థితిలో కొట్టుమిట్టాడింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఫలితంగా ఈ 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సొంతమయ్యాయి. అయితే.. ఇంకా బద్దలు కొట్టాల్సిన అడ్డుగోడలు, అధిగమించాల్సిన మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ మేరకు ఏమేం చేయాలి.. మన పయనం ఎలా సాగాలి??

ఫోర్బ్స్‌ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలోని 20% చిన్న పరిశ్రమలను మహిళలే నడుపుతున్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లోని 73% మంది 20-30 ఏళ్ల మధ్య వయసు వారే.

వ్యాపార రంగంలో కొత్త చరిత్ర: వ్యాపార రంగ చరిత్రను మన మహిళామణులు తిరగరాశారు. బ్యాంకింగ్‌ రంగంలో అరుంధతి భట్టాచార్య, శిఖా శర్మ, నైనా లాల్‌ కిద్వాయ్‌ వంటి వారు స్త్రీ శక్తిని చాటారు. ఎస్‌బీఐ, యాక్సిస్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రసిద్ధ బ్యాంకుల పగ్గాలు చేపట్టి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. భారత ఐటీ దిగ్గజం శివ్‌నాడార్‌ నుంచి ప్రసిద్ధ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ బాధ్యతలు అందుకున్న రోషినీ నాడార్‌... సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.

కరోనా మహమ్మారికి దేశీయ టీకాను ఆవిష్కరించిన భారత్‌ బయోటెక్‌ ప్రస్థానంలో.. సుచిత్ర ఎల్ల పాత్ర ఎనలేనిది. కొవిడ్‌ రక్కసి కోరలు చాచి జనాన్ని అల్లాడించిన వేళ... కొవాగ్జిన్‌తో మేమున్నామంటూ ముందుకొచ్చారు. భారత ప్రభుత్వం సుచిత్ర ఎల్ల కృషిని గుర్తించి.. పద్మభూషణ్‌ ప్రదానం చేసింది. బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమ దాట్ల సైతం టీకాల ఉత్పత్తి రంగంలో దూసుకుపోతున్నారు.

ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ మహిళలు సమర్థంగా తమ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. పారిశ్రామిక, ఐటీ, సాంకేతిక, బ్యాంకింగ్‌ రంగాల్లో ముందంజ వేస్తున్నారు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో సమాన అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. కార్యాలయంలో నూతనత్వం, సామర్థ్యం, సమానత్వాన్ని తీసుకురావడానికి సంస్థలు ఎక్కువగా మహిళలను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఐటీ తర్వాత బ్యాంకింగ్‌, అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో అతివలకు అత్యధిక అవకాశాలు లభిస్తున్నాయి. దేశాభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవ... ఏ జీడీపీ లెక్కలతోనూ కొలవలేనిది. అందుకే ప్రభుత్వాలు చేపట్టే పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రేషన్‌కార్డు, ఇళ్లు, భూ పంపిణీ వంటివి వారి పేరు మీదే ఇస్తున్నారు.

క్రీడల్లో రాణింపు: ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ పోటీల్లో మన దేశానికి ఇప్పటివరకు అతివలే అధిక పతకాలు తెచ్చిపెట్టారు. పీవీ సింధు.... బ్యాడ్మింటన్‌లో రెండుసార్లు ఒలింపిక్‌ పతకాలను ముద్దాడి శిఖరస్థాయి కీర్తిని ఆర్జించారు. తాజా కామన్వెల్త్‌ క్రీడల్లోనూ స్వర్ణభేరి మోగించారు. బ్యాడ్మింటన్‌లో మరచిపోలేని మరో పేరు సైనా నెహ్వాల్‌. ఒలింపిక్స్‌లో కాంస్యం, 2010, 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు సహా ఇప్పటివరకు 24 టైటిళ్లను సాధించారు. టెన్నిస్‌లో సానియా మీర్జా చరిత్ర లిఖించారు. డబుల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌గా నిలిచారు. భారత బాక్సింగ్‌ చరిత్రలో మేరీకోమ్‌ ఓ సంచలనం. మన తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌... బాక్సింగ్‌లో తాజా సంచలనంగా దూసుకుపోతున్నారు.

అక్షరాలే ఆలంబనగా..: 1947లో దేశ మొత్తం అక్షరాస్యత కేవలం 12% ఉండగా... నాడు మహిళల్లో అక్షరాస్యులు 6% మాత్రమే. ప్రస్తుతం మొత్తం అక్షరాస్యత 77.7% ఉండగా మహిళలది 70.3%గా నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నప్పటికీ.... స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

ప్రశ్నించి మరీ... సైన్యంలో దక్కించుకున్న హోదా : సైన్యంలో పురుషులతో సమానంగా తమను శాశ్వత ప్రాతిపాదికన (పర్మినెంట్‌ కమిషన్‌) ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ 17 మంది షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించి, విజయం సాధించారు. సైన్యంలోకి మహిళలను రెగ్యులర్‌ కమిషన్లలోకి తీసుకోవడాన్ని 1950లో నిషేధించారు. కానీ... 1958లో ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1992 తర్వాత వారి నియామకం పెరిగింది. ప్రస్తుతం సైన్యంలో 6,807 మంది, నౌకాదళంలో 704 మంది పనిచేస్తున్నారు. వైమానిక రంగంలో 1.08% తమ సేవలు అందిస్తున్నారు.

ప్రథమ పీఠంపై ఆ ఇద్దరు: స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరుణంలో రాష్ట్రపతి పీఠాన్ని ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము అధిరోహించడం... మహిళాలోక చరిత్రలో అపూర్వఘట్టం. తొలుత ఉపాధ్యాయినిగా పనిచేసిన ముర్ము.. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రతిభ చాటారు. 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ చరిత్రకెక్కగా... ఇప్పుడు ద్రౌపది ముర్ము ఆ పీఠాన్ని అధిష్ఠించారు. భర్తను, కుమారులను కోల్పోయినా.. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసిన ద్రౌపదీ ముర్ము... లక్షల మంది ప్రజలకు ప్రేరణ ఇస్తున్నారు.

.

రాజకీయాల్లో గొప్ప మలుపు: 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు అన్ని స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2002లో పట్టణ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో పంచాయతీల్లోనూ మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చారు. ఫలితంగా వారి ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. అయితే ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే.. పురుషాధిక్య రాజకీయాలను సైతం తమ కనుసైగలతో శాసించిన ధీరవనితలు స్వతంత్ర భారతంలో ఎందరో ఉన్నారు. ఏకైక మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ చరిత్రపై చెరగని ముద్ర వేశారు. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విముక్తి సమయంలో ఆమె ప్రదర్శించిన తెగువ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆమె కోడలిగా వచ్చిన సోనియా.. 2004, 2009లలో యూపీఏ కూటమిని గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. సుష్మాస్వరాజ్‌, సుమిత్రా మహాజన్‌, మాయావతి, మీరా కుమార్‌, వసుంధరరాజే, జయలలిత, ఉమాభారతి, నిర్మలా సీతారామన్‌, మమతాబెనర్జీ తదితరులెందరో రాజకీయాల్లో సమున్నతంగా రాణించారు.

దన్నుగా నిలిచిన రాజ్యాంగం: భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. ఆర్టికల్‌ 14 వనితలకు సమానత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆర్టికల్‌ 15(1) ప్రకారం వివక్షకు తావు ఉండకూడదు. ఆర్టికల్‌-16 సమాన అవకాశాల్ని అందిం చింది. ఆర్టికల్‌-39 (డీ) సమాన పనికి సమాన జీతం చెల్లించాలంది. ఆర్టికల్‌ 51(ఏ).. మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఉపేక్షించొద్దంది. ఆర్టికల్‌-42 స్త్రీలకు ప్రసూతి సెలవులు, అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించింది. భారత ప్రభుత్వం సైతం... వరకట్న నిషేధ చట్టం-1961, నిర్బంధ పని నిషేధ చట్టం-1976 , గృహహింస నుంచి మహిళలకు భద్రతా చట్టం-2005, పనిచేసే చోట మహిళపై హింస నుంచి భద్రతా చట్టం-2012 తీసుకొచ్చింది. నిర్భయ ఘటన తర్వాత సీఆర్‌పీసీని సవరించింది.

.

చట్టసభల్లో రిజర్వేషన్లు: పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం 15 శాతానికి మించడం లేదు. వారికి చట్టసభల్లో సముచితమైన చోటివ్వడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు.... ఆమోదానికి నోచుకోవడం లేదు. పార్లమెంటులో 1996లోనే బిల్లును ప్రవేశపెట్టారు. 25 ఏళ్లు గడిచినా ఆ బిల్లుకు గ్రహణం వీడలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. 2010లో ఎగువ సభ ఆమోదం పొందింది. లోక్‌సభ సుమారు నాలుగేళ్లు పక్కన పెట్టింది. 15వ లోక్‌సభ ముగింపుతో.... ఈ బిల్లు సైతం వీగిపోయింది. అన్ని పార్టీలూ చట్టసభల్లో మహిళల రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% కోటా కల్పిస్తామని.. మ్యానిఫెస్టోల్లో ప్రకటిస్తున్నాయి. ఆమోదానికి నోచుకోకపోవడం పార్టీల చిత్తశుద్ధిని శంకించేలా చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కోటా కల్పిస్తూ.... 1992లోనే బిల్లులు ఆమోదించారు. కొన్ని రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీన్ని అన్ని రాష్ట్రాల్లో చేయాలి.

దేశంలో ప్రతి 10 మంది పురుష ఐఏఎస్‌ అధికారులకు ఒక్కరు మాత్రమే మహిళా ఐఏఎస్‌ ఉండటం అసమానతలకు నిదర్శనం.

భ్రూణహత్యలు బాధాకరం: కొన్ని రంగాల్లో వనితాలోకం ఇప్పటికీ వివక్షకు గురవుతోంది. చదువు, అవకాశాల్లో ఆడపిల్లలపై వివక్ష, భ్రూణ హత్యలు, అత్యాచారాలు... దేశంలో ఏదోమూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా... పోరాటం తప్పడం లేదు.

చిన్నదేశాలు దారిచూపుతున్నాయ్‌..: ఫిన్లాండ్‌, నార్వే, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌, స్వీడన్‌ దేశాలు ఎప్పుడో మహిళా సమానత్వాన్ని సాధించాయి. అక్కడి ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు మహిళలే. ఫలితంగా ఎలాంటి పథకాలైనా నూటికి నూరుశాతం విజయవంతం అవుతుంటాయి.

ఇవీ చదవండి: 1947 నుంచి ఇప్పటివరకు స్వేచ్ఛాభారతంలో ఎన్ని మార్పులో

పంద్రాగస్టు ముహూర్తంపై మౌంట్​బాటెన్ చెప్పిన అసలు కారణం ఇదే

Last Updated : Nov 28, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.