Ayyappa Mandala Pooja 2023 : శబరిమల అయ్యప్ప ఆలయంలో 41 రోజుల పాటు జరిగిన మండల దీక్ష పూజలు పూర్తయ్యాయి. దీంతో బుధవారం రాత్రి ఆలయ అర్చకులు హరివరాసనం ఆలపించి ఆలయాన్ని మూసివేశారు. మకరవిళుక్కు ఉత్సవం కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు మండల దీక్ష సీజన్లో శబరిమల ఆలయానికి రూ.241.71 కోట్లు ఆదాయం సమకూరినట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది.
రూ.18.72 కోట్ల అదనపు ఆదాయం
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం 41 రోజుల మండల సీజన్లో రూ.241.71 కోట్లు సమకూరింది. ఈ మేరకు వివరాలను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. గత ఏడాది మండల దీక్ష సీజన్లో రూ. 222.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 18.72 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. భక్తుల కానుకలు సహా వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఈ మొత్తం సమకూరినట్లుగా ట్రావెన్కోర్ బోర్ట్ ప్రెసిడెంట్ వెల్లడించారు.
అయ్యప్ప భక్తులకు అయ్యన్ యాప్
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకోసం అయ్యన్(Ayyan App) యాప్‌ను కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చింది కేరళ ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా భక్తులు, అయ్యప్ప స్వాములు పలు సేవలను పొందవచ్చు. భక్తుల కోసం అయ్యన్ యాప్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పనిచేసే విధంగా రూపొందించారు. భక్తులకు అత్యవసర సేవలను అందించేందుకు వీలుపడుతుందనే ఉద్దేశంతో కేరళ అటవీశాఖ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా సేవాకేంద్రాల వివరాలు, హెల్త్ ఎమర్జెన్సీ, వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్ట్‌ల వివరాలు, తాగునీరు పాయింట్లను తెలుసుకోవచ్చు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దట్టమైన అడవిలో నడిచి వచ్చే భక్తుల కోసం ఈ యాప్‌ను కేరళ అటవీశాఖ రూపొందించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో అయ్యన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంటుంది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
శబరిమల రద్దీ సమస్యపై 300కు పైగా కేసులు- ప్రభుత్వానికి కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం- అయ్యప్పను దర్శించుకున్న 32 లక్షల మంది భక్తులు