Ayyan App to Help The Devotees In Sabarimala : శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకోసం అయ్యన్(Ayyan App) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేరళ ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా భక్తులు, అయ్యప్ప స్వాములు పలు సేవలను పొందవచ్చు. భక్తుల కోసం అయ్యన్ యాప్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పనిచేసే విధంగా రూపొందించారు. భక్తులకు అత్యవసర సేవలను అందించేందుకు వీలుపడుతుందనే ఉద్దేశంతో కేరళ అటవీశాఖ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ యాప్ ద్వారా ఏయే సేవలు పొందవచ్చు
- శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాల వివరాలు
- హెల్త్ ఎమర్జెన్సీ
- వసతి సౌకర్యలు
- ఏనుగులు సంచరించే ప్రాంతాలు
- ఫైర్ ఫోర్స్
- పోలీస్ ఎయిడ్ పోస్ట్‌ల వివరాలు
- తాగునీరు పాయింట్లు
పలు భాషల్లో..
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దట్టమైన అడవిలో నడిచి వచ్చే భక్తుల కోసం ఈ యాప్‌ను కేరళ అటవీశాఖ రూపొందించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో అయ్యన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంటుంది.
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని..
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దట్టమైన అడవిలో నడిచి వెళ్లే భక్తులు, అయ్యప్ప స్వాములకు వన్యప్రాణుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కేరళ అటవీశాఖ అధికారులు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల కాలంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తులపై చిరుతలు దాడిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరహా ఘటనలు అక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం.
అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు లాంటి వన్యమృగాలు దాడిచేసినట్లయితే.. ఈ యాప్ ఉపయోగించి వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. ఈ లింక్ పై క్లిక్ చేసి గూగుల్ ప్లేస్టోర్ నుంచి అయ్యన్ యాప్‌ను డౌన్‌లోన్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఆరంభంలో కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. ఆ సీజన్లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. 2018 సీజన్లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.