ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కవాతులో 32 శకటాలు పాల్గొనగా ఉత్తర్‌ప్రదేశ్ శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామ మందిర నమూనాతో పాటు ఆ పవిత్ర నగర సాంస్కృతిక వారసత్వాన్ని, దీపోత్సవ ప్రాముఖ్యతను, రామాయణంలోని కీలక ఘట్టాలను తెలియజెప్పేలా రూపొందించిన ఆ శకటాన్ని ఉత్తమ శకటంగా కేంద్రం ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'అయోధ్య' శకటం
త్రిపుర రాష్ట్ర శకటానికి ద్వితీయ పురస్కారం లభించింది. సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆత్మనిర్భర భారత్‌ను సాధించేందుకు పర్యావరణ అనుకూల సంప్రదాయాల ఆచరణను ప్రోత్సహించేలా ఈ శకటాన్ని రూపొందించారు. 'దేవతల భూమి' థీమ్ రూపకల్పన చేసిన ఉత్తరాఖండ్ శకటానికి తృతీయ పురస్కారం లభించింది. ఈమేరకు గురువారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పురస్కారాలు అందజేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.