Auto driver turns Mayor: తమిళనాడు తంజావూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేసే శరవణన్.. కుంభకోణం కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీగా ఉన్న కుంభకోణం.. కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో కుంభకోణం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న శరవణన్‌ను మేయర్ అభ్యర్థిగా ఎన్నుకుంది.
Kumbakonam new mayor
2021 డిసెంబర్ 10న కుంభకోణం.. మున్సిపాలిటీ నుంచి నగర పంచాయతీగా మారింది. 48 వార్డులు ఉన్న కుంభకోణం కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. 42 స్థానాలను డీఎంకే-కాంగ్రెస్ గెలుచుకున్నాయి. మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది డీఎంకే. దీంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ శరవణన్‌ను మేయర్‌గా ఎంపిక చేసింది. గడిచిన పదేళ్లుగా ఆయన కాంగ్రెస్ కుంభకోణం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్న శరవణన్.. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. తన భార్య దేవి, ముగ్గురు కుమారులతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆరో తరగతి వరకే చదువుకున్నా.. స్థానిక ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుంటున్నారు.
మేయర్‌గా ఎంపికైన తర్వాత.. ప్రమాణస్వీకారం చేయడానికి ఆటోలోనే కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు శరవణన్. పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా ఆయన్ను తీసుకొచ్చారు. మేయర్‌గా ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: శశికళతో భేటీ.. పన్నీర్‌సెల్వం సోదరుడిపై వేటు