దేశమంతటా సార్వత్రిక టీకా విధానాన్ని తీసుకురావాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుతున్న తరుణంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. కొవిడ్‌పై పోరులో బంగాల్‌కు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ, ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 40 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచటంపై దృష్టి సారించాలని మమతకు సూచించారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల లేఖను రాశారు.
"కరోనాపై పోరులో ప్రతి రాష్ట్రానికి కేంద్రం మద్దతునందిస్తోంది. అది కేవలం ఆర్థికపరంగానే కాదు. అవసరమైన వైద్య పరికరాలు, డయోగ్నస్టిక్స్, ఔషధాలు సహా ఇతర అత్యవసరమైన సామగ్రిని అందిస్తోంది. బంగాల్లోని కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 40 శాతానికిపైగా ఉంది. అక్కడ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా.. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది."
-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఇటీవల.. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, వరుసగా ముడోసారి అధికారాన్ని చేపట్టిన మమతా బెనర్జీకి హర్షవర్ధన్ తన లేఖలో అభినందనలు తెలిపారు. ప్రస్తుత కరోనా టీకా విధానాన్ని రద్దు చేయాలని.. దేశమంతటా ఒకే ధరతో సార్వత్రిక కవరేజీని తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టును బంగాల్ ప్రభుత్వం ఆశ్రయించిన రోజే కేంద్రం ఈ లేఖను రాయటం గమనార్హం.
అంతకుముందు.. బంగాల్‌కు మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచారని.. కానీ తమ రాష్ట్రానికి సరిపడినంత పెంచలేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: '24 గంటలు కాలేదు.. అప్పుడే రాష్ట్రపతి పాలనా?