సినిమాల్లో హీరోలను చూసి కొందరు నిజజీవితంలో స్ఫూర్తిని పొందితే.. విలన్లను చూసి మరి కొంతమంది ప్రేరణ పొందుతారు. అలాగే తమిళనాడు చెందిన ఓ యువకుడు సంక్రాంతికి విడుదలైన తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'తునివు' సినిమాను చూసి.. అందులో ఉన్న విధంగా బ్యాంక్ దొంగతనానికి పాల్పడ్డాడు. కానీ చివరికి కటకటాల పాలయ్యాడు. అదెలా అంటే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంగళవారం తాడికొంబులోని ఐఓబీ బ్యాంక్‌లో నిందితుడు ఖలీల్ రెహమాన్(25).. కారంపొడి, పెప్పర్ స్ప్రే, కటింగ్ బ్లేడ్, కత్తి మొదలైన ఆయుధాలతో బ్యాంక్‌లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో విధుల్లో ముగ్గురు బ్యాంకు సిబ్బంది ముఖాలపై పెప్పర్ స్ప్రే కొట్టి.. వారిని ప్లాస్టిక్ ట్యాగ్‌లతో బంధించాడు. అందులో ఓ ఉద్యోగి ఎలాగోలా ట్యాగ్‌ను తెంచుకుని బయటకు వచ్చి గార్డ్‌తో సహా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. దీంతో గార్డ్, స్థానికులు వెంటనే బ్యాంక్‌లోకి చేరుకుని నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకి పనిలేకపోవడం వల్ల తీవ్ర నిరాశకు లోనయ్యాడని.. దీంతో దొంగతనాలు చేయడానికి రకరకాల సినిమాలు చూసినట్లు తెలిపాడు. చివరికి అజిత్ నటించిన 'తునివు' సినిమాలో సన్నివేశం ఆధారంగా బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. అనంతరం పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన టెంపో.. వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఇద్దరు..
కర్ణాటకలోని బెంగళూరులో సినీఫక్కీలో భారీ దొంగతనం జరిగింది. ఓ టెంపోను అడ్డగించి.. దాదాపుగా రూ.57 లక్షల విలువైన స్మార్ట్‌వాచ్‌లను వాహనంతో సహా ఎత్తుకెళ్లారు. జనవరి 15న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 15 తేదీన రాత్రి 10:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్ఆర్ నగర్‌లోని జవారిగౌడ ప్రాంతంలో ఓ టెంపోలో రూ.57 లక్షల విలువైన 23 బాక్స్‌ల్లో 1,282 స్మార్ట్‌వాచ్‌లను ఇద్దరు వ్యక్తులు ఫ్లిప్‌కార్ట్ గౌడౌన్‌కు తరలిస్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అయితే బైక్‌కు టెంపో అకస్మాత్తుగా ఢీకొట్టింది. వెంటనే వారిద్దరు టెంపోలో ఉన్న జాన్, బిసల్పై దాడి చేసి.. వాహనంతో పాటు వాచ్‌లను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్నపోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను జమీర్, సయ్యద్గా గుర్తించి అరెస్ట్ చేశారు.