అసోం కరీమ్‌గంజ్ జిల్లాలో ఓ భాజపా అభ్యర్థి వాహనంలో ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రం(ఈవీఎం) బయటపడటం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. గురువారం పోలింగ్ పూర్తైన తర్వాత.. ఈవీఎంను సదరు భాజపా అభ్యర్థికి చెందిన వాహనంలో తరలించడాన్ని ఇతర పార్టీల కార్యకర్తలు గుర్తించి వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో ఓ దశలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.
ఏం జరిగిందంటే?
రతబరి నియోజకవర్గ పరిధిలోని ఇందిరా ఎంవీ పాఠశాల పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్‌కు తరలించే క్రమంలో వాహనం పాడవడం వల్ల.. ఓ ప్రైవేటు కారును ఆపి అందులో తరలించారు. అయితే.. ఆ వాహనం భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే పాథర్‌కాంది కృష్ణేందు పాల్ పేరు మీద ఉండడం యాదృచ్ఛికమేనని అధికారులు వివరణ ఇచ్చారు. ఏఐడీయూఎఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనంపై దాడికి దిగారని తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
రీపోలింగ్..
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది ఎన్నికల సంఘం. ఇందుకు కారణమైన ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సహా.. మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ ఈవీఎంపై తొలుత సీల్ చేసిన ముద్రలు చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ.. సదరు నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
భాజపాపై విరుచుకుపడ్డ ప్రియాంక..
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని పునఃపరిశీలించాలని జాతీయ పార్టీ నాయకులను కోరారామె. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ట్విట్టర్ వేదికగా భాజపాపై విమర్శలు గుప్పించారు. ఈవీఎం ఘటనలు వెలుగుచూసిన ప్రతిసారీ.. అందులో భాజపా హస్తం ఉంటోందని ఆరోపించారు.
"ప్రతిసారీ ఈవీఎంలను ప్రైవేట్ వాహనాల్లో తరలించే అన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. మూడు అంశాలు అన్నింటిలో ఒకేలా ఉన్నాయి. 1) ఆ వాహనాలు సాధారణంగా భాజపా అభ్యర్థులు లేదా వారి అనుచరులకు సంబంధించినవే అయి ఉండటం. 2) ఈ వీడియోలకు సంబంధించిన కేసులన్నింటినీ కొట్టివేయడం. 3) ఈ దృశ్యాలను బహిర్గతం చేసినవారిపైనే భాజపా ఆరోపణలు చేయడం" అని ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రియాంక.
ఈవీఎంలకు సంబంధించిన ఫిర్యాదులపై.. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కోరారు.
తిప్పికొట్టిన భాజపా ఎంపీ..
ప్రియాంక గాంధీ ఆరోపణల్ని తిప్పికొట్టారు ఆ రాష్ట్ర భాజపా ఎంపీ దిలీప్ సైకియా. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు బాగానే ఉన్నాయి కానీ వారు ఓడినప్పుడు మాత్రం ఈవీఎంలు సరిగ్గా పనిచేయవని ప్రతిదాడికి దిగారు. ఇలాంటి ఆరోపణలు హస్తం పార్టీకి అలవాటేనని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: అసోం పోరులో ప్రజలను ఏజీపీ మెప్పించేనా?