Leaves For Employees: కొత్త ఏడాది కానుకగా అసోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది హిమంతబిశ్వ శర్మ సర్కార్. వచ్చే ఏడాది జనవరిలో మొత్తంగా నాలుగు రోజులు పాటు సెలవును ప్రకటించింది. జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు తల్లిదండ్రులు, అత్తమామలతో కలిసి గడిపేందుకు సెలవు (leave for employees to meet parents) తీసుకోవచ్చని అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ (himanta biswa sarma news) తెలిపారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
"తల్లిదండ్రులతో గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఏడాది జనవరి 8, 9 తేదీలు ప్రభుత్వం సెలవు దినాలు. వాటికి అదనంగా 6,7 తేదీలను కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తున్నాం. తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నవారు ఈ నాలుగు రోజులను కొత్త ఏడాది సందర్భంగా వారితో గడిపేందుకు వినియోగించుకోవచ్చు."
- హిమంతబిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
తల్లిదండ్రులు, అత్తమామలు బతికి ఉన్న వారికే ఈ సెలవులను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి శర్మ. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఈ సెలవులను ఉపయోగించుకోవడానికి అర్హులు అని చెప్పారు.
ఇదీ చూడండి: ఆరు నెలల తర్వాత ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్‌బీర్ సింగ్