Assam DGP Vs ULFAI Conflict : అసోం డీజీపీ జీపీ సింగ్, ఉగ్రసంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(యూఎల్ఎఫ్ఏ) మధ్య మాటల యుద్ధం ముదిరింది. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి చేయాలని అసోం డీజీపీ ఛాలెంజ్ విసిరారు. దీనిపై స్పందించిన యూఎల్ఎఫ్ఏ ఆ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్లు శనివారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. కానీ రెండు షరుతులు ఉన్నట్లు తెలిపింది. మొదటగా డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తమతో యుద్ధంలో స్థానిక పోలీసులను కాకుండా సీఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీని (WeSEA- వెస్ట్రన్ సౌత్ఈస్ట్ ఏసియా ప్రాంతంలోని యువకులు మినహా) బరిలోకి దించాలని చెప్పింది. రెండోది గువాహటిలో కనీసం ఒక వారం రోజుల పాటు స్వేచ్ఛగా ఎలాంటి రక్షణ లేకుండా తిరగాలని డీజీపీ జీపీ సింగ్‌కు సవాల్ విసిరింది.
తనపై దాడి చేయాలని డీజీపీ సవాల్
శుక్రవారం మీడియాతో మాట్లాడిన డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, పరేశ్ బరుచా నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. అమాయకులపై గ్రెనేడ్లు విసరడం ఆపాలని చెప్పారు. వారికి నిజంగా దమ్ముంటే డీజీపీ హెడ్ క్వార్టర్స్, కహిలిపారలోని తన నివాసాన్ని టార్గెట్ చేయాలని ఛాలెంజ్ విసిరారు.
"రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పేలుడు జరిపి స్థానికులను బాధపెట్టారు. వారికి (ULFA-I ) నిజంగా ధైర్యం ఉంటే, గువాహటిలోని ఉలుబరిలో ఉన్న నా కార్యాలయం, కహిలిపరాలోని నా నివాసం పేలుళ్లు జరపండి. నేను వారికి భయపడుతున్నానని ఎప్పుడూ చెప్పలేదు"
--జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, డీజీపీ అసోం
అంతకుముందు కొన్ని రోజుల క్రితం యూఎల్ఎఫ్ఏ ఎగువ అసోం ప్రాంతంలో వరుస పేలుళ్లకు పాల్పడింది. డిసెంబర్ 14న జరిగిన జోర్హాట్ గ్రనేడ్ బ్లాస్ట్‌కు తమదే బాధ్యత అని యూఎల్ఎఫ్ఏ ప్రకటించింది. ఈ వివాదాన్ని అసోం- భారత్ మధ్య రాజకీయ సమస్యగా పేర్కొంది. అది రాజకీయంగానే ముగుస్తుందని, కాబట్టి ఈ విషయంలో డీజీపీ జోక్యం చేసుకోవద్దని సూచించింది. దీనికి కౌంటర్‌గా శుక్రవారం డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఛాలెంజ్ విసిరారు.