అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మను ఎన్నుకున్నారు భాజపా శాసనసభ్యులు. ఏకగ్రీవంగా ఆయన్ను సీఎం పదవికి ఎంపిక చేశారు.
ఇదివరకు రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన సర్బానంద సోనోవాల్‌ను కాదని.. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హిమంత బిశ్వశర్మ పేరును ఖరారు చేసింది భాజపా అధిష్ఠానం. సంక్షోభ పరిష్కర్తగా పేరున్న ఆయనవైపే మొగ్గు చూపింది.
అసోంతో పాటు ఈశాన్య ప్రాంతంలో తొలిసారి భాజపా గణనీయంగా పుంజుకోవడానికి శర్మనే కారణంగా చెబుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా మెలుగుతూ, చిన్న రాష్ట్రాలైన మణిపుర్, మేఘాలయాలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. తానేంటో నిరూపించుకున్నారు శర్మ. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయనపై మంచి గురి ఉంది. దీంతో చివరకు ముఖ్యమంత్రి పదవి ఆయననే వరించింది.