Asharam Bapu ashram: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు ఆశ్రమం కారు పార్కింగ్ ప్రదేశంలో.. 13ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆశ్రమాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండా జిల్లాలో జరిగింది. మృతురాలు ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు ఏప్రిల్ 6న పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటారని బాలిక తండ్రి అనుమాం వ్యక్తం చేశారు. ముగ్గురు వ్యక్తుల పేర్లతో ఏప్రిల్ 7న మరో ఫిర్యాదు అందించారు. మృతిచెందిన బాలిక కొత్వాలి గ్రామస్థురాలని పోలీసులు తెలిపారు.
ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుండగానే బాలిక మృతదేహం కనిపించింది. గురువారం రాత్రి ఆశారాం బాపు ఆశ్రమం వెలుపల ఉన్న కారు నుంచి దుర్గంధం రావటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే.. పార్కింగ్ ప్రదేశంలో కుళ్లిపోయిన స్థితిలో గొండా-బహ్రిచ్ రోడ్డులో మృతదేహం లభించింది. మృతురాలి తండ్రికి.. ముగ్గురితో భూతగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే బాలిక హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 'హైబ్రిడ్ ఉగ్రవాదుల కేసు'లో 25మందిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్