Artificial Rain In Delhi : దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని తగ్గేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. అయితే తాజాగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)-కాన్పుర్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్య తీవ్రతను తగ్గించేలా.. కృత్రిమ వర్షాలను కురిపించేందుకు సిద్ధమైంది. అందుకోసం కొత్త సాంకేతికతను తయారు చేసింది.
ఐఐటీ కాన్పుర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ .. కృత్రిమ వర్షాల కోసం తమ వద్ద ఉన్న ప్రణాళిక గురించి వివరించారు. ఐఐటీ కాన్పుర్ శాస్త్రవేత్తల బృందం.. ఈ ఏడాది జులైలోనే కృత్రిమ వర్షాలకు సంబంధించిన ట్రయల్స్‌ను పూర్తి చేసిందని తెలిపారు. తమ శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్ కోసం ఐదేళ్లు తీవ్రంగా శ్రమించిందని వివరించారు.
"కృత్రిమ వర్షాలను కురిపించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఐఐటీ కాన్పుర్ బృందం ఐదేళ్లు కష్టపడింది. విమానం ద్వారా రసాయనాలను మేఘాలలో చల్లితే నిర్దిష్ట ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. మేము అందుకు తగ్గట్లు విమానాన్ని తయారు చేసుకున్నాం. కొన్ని విమాన విడిభాగాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. కొవిడ్ రావడం వల్ల కాస్త ఆలస్యమైంది. దేశ రాజధాని దిల్లీ మీదగా విమానం ఎగరడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), హోం మంత్రిత్వ శాఖ, ప్రధానికి సెక్యూరిటీ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) నుంచి అనుమతులు పొందాల్సి ఉంది." అని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. దిల్లీ ప్రభుత్వంతో కృత్రిమ వర్షాలపై చర్చలు జరుపుతున్నామని మనీంద్ర అగర్వాల్ చెప్పారు.
మరోవైపు.. దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.
కృత్రిమ వర్షాలు అంటే ఏమిటి?
వానలు పడని ప్రదేశాల్లో ఈ కృత్రిమ వర్షాలకు కురిపిస్తారు. అంటే మేఘాల్లోకి రసాయనాలను పంపించి.. వర్షాలు పడేటట్లు ప్రేరేపిస్తారు. అమెరికా, చైనా, యూఏఈ వంటి దేశాలు నీటి కొరత, కరవులు వంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇలానే చేస్తున్నాయి. అయితే దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాలు కురిపించాలని ఇప్పుడు ప్రభుత్వం, నిపుణులు భావిస్తున్నారు.
దిల్లీలో తగ్గని వాయుకాలుష్యం- స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కేంద్రం అత్యవసర సమావేశం!