భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి సంవత్సరం దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు. తూర్పు లద్దాఖ్‌కు సమీపంలో చైనా ఎయిర్‌బేస్ వద్ద ఆ దేశ సైన్యం 20కి పైగా యుద్ధవిమానాలతో విన్యాసాలు నిర్వహించినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ అభ్యాసాలను తాము జాగ్రత్తగా గమనించినట్లు పేర్కొన్నాయి.
"దాదాపు 21-22 చైనా యుద్ధవిమానాలు భారత భూభాగమైన తూర్పు లద్దాఖ్‌కు ఎదురుగా అభ్యాసాలు నిర్వహించాయి. వీటిలో ప్రధానంగా జే-11, జే-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
హోటన్, గర్ గన్సా, కష్గర్ ఎయిర్‌బేస్‌లలో ఇటీవల చైనా వాయిసేన కార్యకలాపాలను పెంచిందని అధికారిక వర్గాలు తెలిపాయి. అన్ని రకాల యుద్ధ విమానాలతో అభ్యాసాలు నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఈ ఎయిర్‌బేస్‌లో ఎన్ని ఫైటర్ జెట్లు ఉన్నాయో తెలిసే అవకాశం లేకుండా చైనా ఏర్పాట్లు చేసుకున్నట్లు వివరించాయి.
అయితే చైనా యుద్ధవిమానాలు ఆ దేశ సరిహద్దులోనే ఉన్నాయని, భారత భూభాగంలోకి ప్రవేశించలేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
ఏడాదిగా...
గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణ జరిగిన తర్వాత సరిహద్దులో యుద్ధ విమాన కార్యకలాపాలను భారత్ పెంచింది. ఈ వేసవిలో సరిహద్దులో భారీగా బలగాలను, ఫైటర్ జెట్లను మోహరించిన డ్రాగన్‌కు దీటుగా భారత్ కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. మిగ్-29లను మోహరించింది. వీటితో పాటు సైన్యంలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధవిమానాలతో గస్తీ పెంచి తమ శక్తి సామర్థ్యాలేంటో పొరుగు దేశానికి చాటి చెప్పింది.
బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాల నుంచి చైనా తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 వంటి వాయు రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచిందని అధికార వర్గాలు చెప్పాయి.