దేశంలో అనేక రంగాలను తీవ్రంగా కుదిపేసిన కరోనా.. రైల్వే శాఖను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అధికారులు తెలిపారు. కరోనా సోకి సంస్థలోని 700 మంది యోధులను కోల్పోయామని వెల్లడించారు. వీరంతా మహమ్మారి సమయంలో సేవలందిస్తూ మృతిచెందారన్న అధికారులు.. అధిక శాతం సాధారణ కుటుంబాల వారేనని పేర్కొన్నారు. తొమ్మిది నెలల్లో సుమారు 30వేల మంది వైరస్ బారినపడ్డారని చెప్పారు.
ఈ మేరకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్. ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధుల త్యాగాలను ఆయన ప్రశంసించారు. అయితే.. సరైన చికిత్స విధానంతో అనేక మంది సిబ్బంది.. వైరస్‌ను జయించారని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి రైల్వేస్టేషన్‌లోనూ కరోనా సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రతి ఉద్యోగిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. తొలుత 50 వరకు ఉన్న కరోనా ఆస్పత్రులను ఇప్పుడు 74కు విస్తరించామని వివరించారు.
అందని పరిహారం..
అయితే.. మరణించిన రైల్వే ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి పరిహారం అందలేదని పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చింది రైల్వే శాఖ. వీరందరికీ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ మార్గదర్శకాలను అనుసరించి.. త్వరలోనే ఎక్స్‌గ్రేసియా మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'రైల్వేసేవల పునఃప్రారంభ తేదీని కచ్చితంగా చెప్పలేం'