Indian Army Dog Zoom: ముష్కరులతో వీరోచితంగా పోరాడి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఆర్శీ శునకం 'జూమ్' మృతదేహానికి ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు. జూమ్ శవపేటికపై పుష్ప గుచ్ఛాల్ని ఉంచి గౌరవ వందనాలు సమర్పించారు. తన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమంటూ అంజలి ఘటించారు. వీర శునకం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆర్మీ అధికారులు శునకానికి అంతిమ సంస్కరాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ జరిగింది..
అనంతనాగ్‌లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా అధికారులకు సోమవారం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముష్కరులపై భద్రతా బలగాలు దాడులు చేశాయి. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు 'జూమ్' అనే ఆర్మీ శునకాన్ని పంపించారు అధికారులు. ఈ క్రమంలో జూమ్‌పై కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీంతో శునకానికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయినా జూమ్ వీరోచిత పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూమ్ గురువారం మృతి చెందింది.
ఇదీ చదవండి: పది నెలల్లో 13 మంది బలి.. ఎట్టకేలకు చిక్కిన 'సీటీ-1' పులి