Army Agriculture: రక్షణశాఖలో వివిధ విభాగాలలో పనిచేసి పదవీ విరమణ అయిన సైనికులను, మహిళా సిబ్బందిని రైతులుగా, వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా (అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) మార్చే కొత్త పథకం త్వరలో మొదలుకానుంది. హైదరాబాద్‌లోని 'జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ' (మేనేజ్) రూపొందించిన ఈ పథకానికి కేంద్ర రక్షణశాఖ ఆమోదం తెలిపింది. దీనికి ‘జై జవాన్ కిసాన్’ అనే పేరు పెట్టారు. దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 60,000 మంది సిబ్బంది రక్షణశాఖ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు. రిటైరయ్యే సమయానికి వీరి వయసు 34 నుంచి 48 ఏళ్ల వరకూ ఉంటోంది. ఎక్కువమంది మళ్లీ ఇతర ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. వీరిలో 90 నుంచి 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. వారిలో 80.60 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. అయినా వీరిలో ఎక్కువ మంది సేద్యంలోకి ఎందుకు వెళ్లడం లేదని ఇటీవల 'మేనేజ్' అధ్యయనం చేస్తే పంటలు పండించడం ఎలాగో తెలియదని చాలామంది చెప్పారు. ఈ లోపాన్ని అధిగమించి వారిని సేద్యంలోకి మళ్లించేందుకు మేనేజ్ ఒక నివేదికను రూపొందించింది. ఈ ప్రణాళికను వివరిస్తూ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
రక్షణశాఖ సహకరిస్తే సైనిక సిబ్బంది రిటైరయ్యే ముందు లేదా రిటైరైన వెంటనే సైనికులకు వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, మార్కెటింగ్, అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడానికి మేనేజ్ ప్రతిపాదించగా ఈ ప్రతిపాదన బాగుందని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాజీ సైనికులను వ్యవసాయం వైపు మళ్లిస్తే అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుందని, గ్రామాలకు సుశిక్షితులైన మానవ వనరులు లభిస్తాయని సూచించింది. వారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమల నిపుణులతో అనుసంధానం చేస్తారు. శిక్షణ కోసం ఆసక్తి చూపే సైనికులను పునరావాస ప్రణాళిక కింద రక్షణ మంత్రిత్వ శాఖ మేనేజ్‌కు సిఫార్సు చేస్తుంది. శిక్షణ కోసం వారు హైదరాబాద్‌లోని మేనేజ్‌కు రావాలి. వచ్చే జులై నుంచి తొలిదశలో 30 మంది మాజీ సైనికులతో కూడిన మొదటి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభిస్తారు. తొలి ఏడాది కనీసం 4 బృందాలకు శిక్షణ ఇవ్వాలని మేనేజ్ లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. వ్యవసాయంలోకి వారి ప్రవేశం ఆ రంగంలో ఒకరకమైన క్రమశిక్షణను కూడా తీసుకువస్తుందని అంచనా.
వ్యవసాయానికి నిపుణులు చాలా అవసరం..
"మనదేశంలో వ్యవసాయ రంగం అతిపెద్దది. కానీ నిపుణులైన వారు సేద్యం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మేనేజ్ అధ్యయనంలో గుర్తించాం. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు నిపుణుల కొరత చాలా ఉంది. ఎందుకంటే వ్యవసాయం సంక్లిష్టమైంది. పైగా ఆధునిక టెక్నాలజీతో రోజురోజుకు సాగు పద్ధతులు, నిర్వహణ మారుతున్నాయి.
ఈ రోజు ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నట్లుగా వ్యవసాయం లేదు. అందుకే క్రమశిక్షణ కలిగిన సైనికులను ఇందులోకి తీసుకొస్తే వారు కష్టపడి సేద్యం చేసి మంచి దిగుబడులు సాధిస్తారు. పంటలు పండించడమే కాకుండా పంటల మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వాటికి బ్రాండ్ పేరు పెట్టి అమ్మకాలు వంటి పనుల్లో రిటైరైన సైనికులు విజయం సాధిస్తే.. వారు రైతులకు మంచి ఆదాయం రావడానికి మార్గం చూపుతారు. ఇప్పటికే దేశంలో అక్కడక్కడ కొందరు ఇలా క్రమశిక్షణతో సేద్యం చేసి లాభాలు గడించడాన్ని చూసి ఈ పథకానికి రూపకల్పన చేశాం."
- డాక్టర్ చంద్రశేఖర, డైరక్టర్ జనరల్, మేనేజ్
ఇదీ చదవండి: భారత వాయుసేన చేతికి 500కేజీల బాంబు.. శత్రువులకు హడల్!